కందిపప్పు చోరీ..
ముంబై: పప్పు ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దొంగలు రూటు మార్చి కిరాణా దుకాణాలను దోచుకుంటున్నారు. ఇటీవల నలాసోపారాలో మూడు దుకాణాల్లో దొంగతనం చేసిన దొంగలు 30 కేజీలు పప్పులను, రూ. వెయ్యి విలువగల డ్రై ఫ్రూట్స్‌ను దోచుకెళ్లారు. అయితే స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల ద్వారా దొంగలు దొరికిపోయారు.
పండుగ సందర్భంగా పప్పు ధాన్యాలు, డ్రై ఫూట్స్ ధరలు పెరగడంతో దుకాణాలపై కన్నేసిన దొంగలు అకోలే గ్రామంలోని సిద్ధి వినాయక, సాయి సంతోషీ స్టోర్స్‌లోని సామాగ్రిని అందినంతవరకు ఎత్తుకెళ్లారు. చాకొలెట్లు, బిస్కెట్లు, డబ్బులతోపాటు పప్పు ధాన్యాలను కూడా దొంగలు తమ లిస్టులో వేసుకున్నారు. 'పండుగ సందర్భంగా పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకొచ్చాం. దుకాణం మూసేసిన తర్వాత దొంగలు చొరబడి 30 కేజీల కందిపప్పు, డ్రై ఫ్రూట్స్‌ను ఎత్తుకెళ్లారు' అని సాయి సంతోషి దుకాణం యజమాని రాజ్ గుప్తా చెప్పారు. బిస్కెట్లు, డబ్బు, ఇరత వస్తువులతో పాటు మొత్తం రూ. 20 వేల విలువగల సొత్తును దోచుకెళ్లారు’ అని మరో వ్యాపారి మంగేలాల్ చౌదరి పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.