ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై: థానేలోని మన్‌పాడ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 12 కోట్ల నగదు కొట్టేసిన కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్‌ను పుణెలో పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం విచారణ అధికారి వెల్లడించారు. వేషం మార్చి, న్యూలుక్‌లో షికార్లు కొడుతున్న నిందితుడికి సంఘటన జరిగిన సుమారు రెండున్నర నెలల తరువాత పోలీసులు చెక్ పెట్టారు. అతడి వద్ద నుంచి 9 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
సోమవారం థానే , నవీ ముంబై పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో షేక్‌ను అరెస్టు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఈ భారీ చోరికి నిందితుడు భారీ ప్లానే వేశాడు. ముంబైకి చెందిన షేక్ ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్‌గా పని చేసేవాడు. కస్టోడియన్‌గా అంటే లాకర్ తాళాలకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నగదు చూసి అతనికి బుద్ధి పక్కదారి పట్టింది. ఎలాగైనా సొమ్మును తస్కరించాలని గత ఏడాది కాలంగా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో సిస్టంలోని లూప్ హోల్స్‌ని గమనించాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీని ట్యాంపరింగ్ చేసి, ఏసీ డక్ట్ ద్వారా మొత్తం దోపిడీని ప్లాన్ చేశాడు. అంతేకాదు తనను ఎవరూ గుర్తించకుండా బురఖా వేసుకొని మరీ నగదు దోచేశాడు. ఈ వ్యవహారంలో సహకరించిన షేక్ సోదరి నీలోఫర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు అబ్రార్ ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిను పోలీసులు అరెస్టు చేశారు.
అలారం సిస్టమ్‌ను డియాక్టివేట్ చేసి, సీసీటీవీని ధ్వంసం చేసిన తర్వాత, షేక్ బ్యాంక్ ఖజానాను తెరిచి, నగదును కొట్టేసి అక్కడినుంచి పారి పోయాడు. ఈ ఏడాది జూలై 12న ఈ చోరీ జరిగింది. అయితే డీవీఆర్ సెక్యూరిటీ డబ్బు కూడా కనిపించకుండా పోయిందని సిబ్బంది గ్రహించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షేక్‌ను అరెస్టు చేసి చోరీకి గురైన మొత్తం 12.20 కోట్లలో సుమారు 9 కోట్లను రికవరీ చేయగలిగారు, మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment