ప్రతీకాత్మక చిత్రం
ముంబై: రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై దోపిడీ దొంగలు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన లక్నో– ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. తాజాగా ఈ ఘటనతో మహిళలకు బయట ఏ మాత్రం రక్షణ ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి, ఎనిమిది మంది దుండగులు ఆయుధాలతో, మహారాష్ట్రలోని ఇగత్‌పురి పట్టణంలో లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లోకి ప్రవేశించారు.
ఆ భోగిలో పోలీసులు లేరని తెలుసుకున్న దుండగులు ప్రయాణికుల వద్ద అందినంత వరకు దోచుకోవడంతో పాటు ఓ మహిళా ప్రయాణికురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళపై అఘాయిత్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన తోటి ప్రయాణికులను కూడా వారు ఆయుధాలతో గాయపరిచారు. ఈ దాడిలో సుమారు ఆరు మంది వరకు గాయపడినట్లు సమాచారం. ప్రయాణికులు ఆందోళనకు గురై గట్టిగా అరవడంతో రైలును ముంబైలోని కాసరా స్టేషన్ వద్ద ఆపేశారు.
అప్రమత్తమైన పోలీసులు ఆ కోచ్ వద్దకు చేరుకుని ఇద్దరు దొంగలను అరెస్టు చేయగా, తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రస్తుతం మరో నలుగురి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అదుపులోకి తీసుకున్న దొంగల నుంచి రూ. 34 వేల నగదు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం, దోపిడి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా...
Comments
Please login to add a commentAdd a comment