రవాణాశాఖ ఉద్యోగులు, కార్మికుల వేతన పెంపుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం నిర్వహించిన సమ్మె పాక్షికంగా విజయవంతమైంది. ప్రభుత్వ రవాణాశాఖలోని డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె పాటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రవాణాశాఖలో 1.40 లక్షల మంది పనిచేస్తున్నారు. 11వ వేతన ఒప్పందం 2013 ఆగష్టు 31వ తేదీతో ముగిసింది. 12వ వేతన సవరణ ఒప్పందం అదే ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం చర్చల పేరుతో జాప్యం చేసింది. దీంతో విసుగు చెందిన ఉద్యోగులు గత ఏడాది డిసెంబరులో నాలుగురోజుల పాటు సమ్మె జరిపారు. బస్సు సేవలను స్తంభింపజేశారు. ఆ తరువాత ప్రభుత్వం దిగివచ్చి వేతన సవరణపై కమిటీని నియమించింది.
రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, కార్యదర్శి ప్రభాకర రావు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి ఉమానాథ్‌ల ఆధ్వర్యంలో గత నెల 2 నుంచి ఈనెల 13వ తేదీ వరకు ఆరు దశల్లో చర్చలు జరిపారు. రవాణా సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున ఉద్యోగులు ఆశించిన మేరకు వేతనాలను పెంచలేమని 5వ దశ చర్చల సమయంలో మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొనడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. 5.5 శాతం వేతనాన్ని పెంచాలని నిర్ణయించుకున్నట్లు ఈనెల 13న జరిగిన చర్చల్లో మంత్రి ప్రకటించగా, కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం ఒక్కరోజు సమ్మె పాటించాలని వెంటనే నిర్ణయం తీసుకున్నారు.
బస్టేషన్‌లో 70 శాతం బస్సులు
సంఘాల పిలుపుమేరకు మంగళవారం నాటి సమ్మెలో భాగంగా 70 శాతం బస్సులు బస్‌స్టేషన్‌కే పరిమితమైనాయి. తెల్లవారుజాము 4 గంటల నుంచి సమ్మె ప్రారంభం కాగా పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు. బస్సులు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే అధికార పక్షం మాత్రం సమ్మె ప్రభావం ఎంతమాత్రం లేదని ప్రకటించింది. 3058 బస్సులకు గానూ 3117 బస్సులను అంటే అదనంగా 57 బస్సులను నడిపి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపింది.
రవాణా సమ్మె
Published Wed, Apr 15 2015 4:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement