ప్రత్యేక మన్యసీమ కావాలి
నగరంలోని జంతర్‌మంతర్‌లో
ఆదివాసీల ధర్నా
అలరించిన మన్యం నృత్యాలు
సాక్షి, న్యూఢిల్లీ: మన్యసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆదివాసీ గిరిజన సంఘాల జాక్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలో వందల సంఖ్యలో ఆదివాసులు పాల్గొన్నారు. సంప్రదాయ వేషధారణలు, నృత్యాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. మన్యసీమ జాక్ ఏపీ కన్వీనర్ చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసీయుల పలు డిమాండ్లను నాయకులు ఏకరువు పెట్టారు. అంతకుముందు ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన గుసడి,గిరిజన కోయకొమ్ము నృత్యాలు జంతర్‌మంతర్‌కి వచ్చిన ఆందోళనకారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు నెమలిఈకలతో తయారు చేసిన టోపీలను ధరించి చేసిన గుసడి నృత్యానికి అక్కడున్నవారు కరతాళధ్వనులతో అభినందించారు.
అనంతరం ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి వచ్చిన 50 మంది కళాకారులు గిరిజన కోయకొమ్ము డ్యాన్స్‌చేశారు. ‘అడవిలాన్వో నామనయినో.కొమ్ములేలో..(అడవిలోపుట్టి పెరిగా...)’అంటూ గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు.కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, కోడూరి నారాయణరావు,ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీయులు పాల్గొన్నారు.