janthar manthar
-
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రైతు నిరసన
-
‘ముజఫర్‌పూర్’ రేప్‌లు సిగ్గుచేటు
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతి గృహంలో బాలికలపై అత్యాచారాలు సిగ్గుచేటని విపక్షాలు ఖండించాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ఆర్జేడీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలు పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. బిహార్‌లో అధికార జేడీయూ–బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ముజఫర్‌పూర్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికలకు అండగా ఉంటామని రాహుల్ అన్నారు. ప్రస్తుతం దేశమంతా ఒకవైపు, ఆర్ఎస్సెస్–బీజేపీ భావజాలం ఒకవైపు ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలను దేశం ఇష్టపడటం లేదని, ప్రజలు తలచుకుంటే ఎవరూ వారి ముందు నిలవలేరని అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్న తేజస్వి యాదవ్ మాట్లాడుతూ..రేప్ ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇలాంటి హేయమైన నేరాల్లో దోషులకు కఠిన శిక్ష విధించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరాచకం రాజ్యమేలుతోందని ఏచూరి మండిపడ్డారు. ‘భేటీ బచావో’ నినాదం ‘సేవ్ భేటీ ఫ్రమ్ బీజేపీ’గా మారిందన్నారు. బాలికలకు బదులుగా బీజేపీ గోవులను కాపాడుతోందని శరద్ యాదవ్ ధ్వజమెత్తారు. -
నిరసన హక్కుకు ఊపిరి
జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నుంచి ఊహించని రీతిలో భావ ప్రకటనా స్వేచ్ఛకు వచ్చి పడిన ముప్పు తప్పింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సభలూ, సమావేశాలూ జరపడాన్ని నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. తరచు జరిగే సభలూ, సమావేశాల వల్ల ఆ ప్రాంతం కాలుష్యమయం అయిందని, అక్కడ ఆందోళనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవటం తక్షణావసరమని నిరుడు అక్టోబర్‌లో ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. సాధారణంగా ట్రిబ్యునల్ ఇచ్చే ఉత్తర్వుల అమలులో అలసత్వాన్ని ప్రదర్శించే ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటీన వాటిని అమలు చేసి ఆ ప్రాంతంలో నిరసన స్వరం వినబడకుండా జాగ్రత్తపడింది. అయితే సభలూ, సమావేశాల వల్ల సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి తప్ప అసలు నిరసనలకే చోటీయరాదనుకోవటం అప్రజాస్వా మికమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పులో స్పష్టం చేసింది. ఏడాది పొడవునా ఎడతెగకుండా సాగే నిరసనల వల్ల జంతర్‌మంతర్ వాసులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల్లో అవాస్తవం లేకపోవచ్చు. వివిధ సంస్థలు, పార్టీలు ఏదో ఒక సమస్యపై అక్కడ సభలూ, సమావేశాలూ నిర్వహిస్తాయి. వాటిల్లో పాలుపంచుకోవటానికి వేర్వేరు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజానీకం అక్కడికొస్తుంది. అంతమంది జనం ఒకచోట గుమిగూడి నప్పుడు ట్రాఫిక్ సమస్య మొదలుకొని ఎన్నో సమస్యలు వస్తాయి. పారిశుద్ధ్యం కూడా అందులో ఒకటి. నిరసన తెలపడానికి వచ్చిన వారిని అందుకు నిందించి ప్రయోజనం లేదు. భారీ సంఖ్యలో పౌరులు వచ్చినప్పుడు వారికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడటం, తగినన్ని మరుగుదొడ్లు ఉండేలా చూడటం, నిర్ణీత సమయం తర్వాత మైకులు ఉపయోగించరాదని నిబంధనలు విధించటం వంటివి అమలు చేయటం ద్వారా స్థానికులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఇబ్బందులను తొల గించడానికి వీలుంది. హరిత ట్రిబ్యునల్ ఈ కోణంలో ప్రభుత్వానికి తగిన మార్గదర్శకాలిచ్చినా... కనీసం ప్రభుత్వం తనకు తాను ఈ మాదిరి చర్యలు తీసుకున్నా బాగుండేది. కానీ ట్రిబ్యునల్ ఆదే శాలివ్వటమే తరవాయి అన్నట్టు జంతర్‌మంతర్‌లో నిరసనలను నిషేధించింది. ట్రిబ్యునల్ ఆ ఉత్తర్వులిచ్చే సమయానికి ‘ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్’ కోరుతూ మాజీ సైనికులు జంతర్‌మంతర్‌లో నిరసన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు ఆ మాజీ సైనికులు వేసుకున్న టెంట్లు కూలగొట్టి, అక్కడినుంచి వెళ్లగొట్టారు. వీరంతా సైన్యంలో ఉన్నతస్థాయి అధికారులుగా, సాధారణ జవాన్లుగా పనిచేసి రిటైరైనవారు. రణరంగంలో శత్రువుతో తలపడి దేశ రక్షణకు నిలబడిన యోధుల గోడు పట్టించుకోకపోవడమే అన్యాయమనుకుంటే...దాన్ని బలంగా వినిపించటం కోసం నిరసన ప్రదర్శ నలు నిర్వహిస్తుంటే అందుకు సైతం అవకాశమీయలేదు. అదేమంటే ట్రిబ్యునల్ ఆదేశాలు పాటిస్తు న్నామని జవాబు! అసలు ట్రిబ్యునల్ ప్రధాన వ్యాపకం పర్యావరణ పరిరక్షణ. గాలి, నీరు కాలుష్య మయం చేసే చర్యలను అరికట్టడం, అడవులు అంతరించిపోకుండా, ఎడాపెడా మైనింగ్ కార్యకలా పాలు సాగకుండా చూడటం దాని బాధ్యతలు. నిరసనలవల్ల కాలుష్యం ఏర్పడుతుందని, దాన్ని నియంత్రించడం కూడా తన కర్తవ్యమేనని ట్రిబ్యునల్‌కు ఎందుకు అనిపించిందో! తాము వేయికళ్లతో సుభిక్షంగా పాలిస్తున్నామని, సమాజంలో ఏ వర్గానికీ అన్యాయం జరిగే అవకాశం లేదని పాలకులు తమకు తాముగా నిర్ణయించుకుంటే చెల్లదు. అసహాయులను గొంతె త్తనీయాలి. జరుగుతున్న అన్యాయాలేమిటో చాటడానికి అవకాశమీయాలి. అప్పుడే పొరపాట్లు సరిదిద్దుకోవటానికి అవకాశముంటుంది. అదే ప్రజాస్వామ్యమనిపించుకుంటుంది. ఏం జరిగినా తమకు విన్నపాలు చేసుకుని నోర్మూసుకోవాలని, వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకోవాలని భావిస్తే కుదరదు. ఢిల్లీ వీధుల్లో కదులుతున్న బస్సులో ఆరేళ్లక్రితం ఒక యువతిపై అత్యాచారం జరిపి, ఆమెనూ, ఆమెతో ఉన్న మరో యువకుణ్ణి చావుబతుకుల మధ్య నడిరోడ్డుపై విసిరేసినప్పుడు జంత ర్మంతర్లో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నివిధాలుగా ఉద్యమాన్ని అణచాలనుకున్నా అది ఉవ్వెత్తున ఎగసింది. ఫలితంగా అత్యాచారాలను అరికట్టడానికి నిర్భయ చట్టం అమల్లోకొచ్చింది. ఆ చట్టం ఆచరణలో ఎలా విఫలమవుతున్నదన్న అంశం పక్కనబెడితే సమస్య తీవ్రత అర్ధం కావ టానికి, అది తక్షణం పరిష్కరించాల్సి ఉన్నదని సర్కారు గ్రహించటానికి జంతర్‌మంతర్ నిరసన ఎంతగానో తోడ్పడింది. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, భూసేకరణ చట్టం, అట్టడుగు వర్గాలవారికి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు గాల్లోంచి ఊడిపడలేదు. పాలకులకు ఏ బోధివృక్షం నీడనో జ్ఞానోదయం కావడం వల్ల రూపొందలేదు. ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు పోటెత్తడం వల్లే... తమకు కావాల్సిందేమిటో ప్రజలు ఎలుగెత్తి చాటడం వల్లే ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. నల్లజెండాలు కనబడకపోతే, నినాదాలు వినబడకపోతే, మా డిమాండ్ల సంగతేమిటని ఎవరూ నిలదీయకపోతే పాలకులకు బాగానే ఉంటుంది. అలాగే ఎటు చూసినా భజన బృందాల సందడి కనిపిస్తే సంతోషంగానే అనిపిస్తుంది. కానీ అది గల్ఫ్ దేశాల్లోనో, ఉత్తరకొరియాలోనో, చైనాలోనో సాధ్యం కావచ్చుగానీ ఇక్కడ కుదరదు. దురదృష్టకరమైన సంగతేమంటే... ఈమధ్యకాలంలో అన్ని ప్రభుత్వాలూ నిరసనల విషయంలో ఒకేలా ప్రవర్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ఉండొద్దని తెలంగాణ సర్కారు, అమరావతిలో ప్రశ్నిస్తే పాపమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ నిరసనల నోరు నొక్కుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జంతర్‌మంతర్ నిరసనల విషయంలో వెలువరించిన తీర్పు వెనకున్న స్ఫూర్తిని గ్రహించి అయినా అన్ని ప్రభుత్వాలూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాలి. -
ఉద్యమం ఉధృతం
సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదా ఉద్య మం ఉధృతమైంది. ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోవటంతో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పోరుకు సిద్ధమయ్యారు. మూడున్నరేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా ఉద్యమబాట పట్టారు. అధినేత పిలుపుతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన ధర్నాకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పార్లమెంటరీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుధీర్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఎస్వీయులోని అన్ని కార్యాలయాలు, కళాశాలలను బహిష్కరించి ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. టంగుటూరి ప్రకాశం పంతులు భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆదేశాల మేరకు రాత్రి పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో క్యాండిల్ చేతబట్టి ప్రత్యేక హోదానే ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. శ్రీకాళహస్తిలో నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో గాలిగోపురం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. కార్వేటినగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. పలమనేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక హోదాకోసం దీక్షలు నిర్వహించారు. కుప్పంలో నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బస్టాండు ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి, ప్రత్యేక హోదా తమ హక్కు అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రైతులు, వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
వరంగల్ లీగల్/ న్యూశాయంపేట : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును కేటాయించాలని కోరుతూ సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంత ర్ వద్ద చేపట్టిన ధర్నాలో జిలా న్యాయవాదు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జయాకర్, రమణ, సహోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అల్లం నాగరాజు, సీనియర్ న్యాయవాది, టాడు గౌరవాధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 300 మందికి పైగా లాయర్లు ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, జడ్జీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తాళ్లపెల్లి జనార్దన్, వలుస సుధీర్, నీలా శ్రీధర్‌రావు, తాటికొండ కృష్ణమూర్తి, సంజీవరావు, చిదంబర్నాథ్, సంసాని సునిల్, విద్యాధర్రాజ్, లలిత, స్వప్న పాల్గొన్నారు. 50వ రోజుకు చేరిన నిరసనలు వరంగల్ లీగల్ : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో న్యాయవాదుల నిరసన కార్యక్రమాలు సో మవారం 50వ రోజుకు చేరాయి. బార్ అ సోసియేషన్ మహిళా కార్యదర్శి మానేపల్లి కవిత నేతృత్వంలో న్యాయవాదులు ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలి పారు. కార్యక్రమంలో శ్రీనివా స్, జాఫర్, రమణాకర్‌రాజు, మహేంద్రప్రసాద్, అంబ రీషరావు, శ్రీహరిస్వామి, సదాశివుడు, దయాకర్, రమేష్, ఆండాళు, భాగ్యమ్మ, పద్మలత, జ్యోతి, రంజిత్ పాల్గొన్నారు. -
చర్చోప చర్చలు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ బిల్లుపై ఢిల్లీలో హడావుడి మొదలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యూపీఏ ప్రభుత్వం చివరి పార్లమెంటు సమావేశాలు బుధవారం ప్రారంభం కావడం.. ఈ సమావేశాల్లోనే ‘టీ’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా హస్తినలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణ బిల్లుపై తె లంగాణ, సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు పోటాపోటీగా దేశ రాజధాని ఢిల్లీలో మోహరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు జంతర్ మంతర్‌లో మౌనదీక్ష చేయడం.. సీఎం దీక్షకు కౌంటర్‌గా తెలంగాణ ప్రతినిధులు కూడా ఆందోళనకు దిగడంతో మారుతున్న సమీకరణలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో బుధవారం టీవీలకు అతుక్కుపోయిన ప్రజలు, వివిధ పార్టీల శ్రేణులు ఢిల్లీ పరిణామాలను ఆసక్తిగా వీక్షించారు. అసలేం జరుగుతోంది.. బిల్లు ప్రవేశపెడతారా? బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే అంశాలపై చర్చోపచర్చలు సాగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సహా జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు కేఎల్లార్, బండారి రాజిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సైతం హస్తినలోనే ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి బుధవారం న గరానికి చేరుకున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే ‘టీ’ బిల్లుపై క్షణక్షణం చోటుచేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించుకునే పనిలో రాజకీయనేతలు నిమగ్నమయ్యారు. -
ఢిల్లీ యాత్ర విజయవంతం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ బాధితుల పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా విజయవంతమైందని జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయి నాయకులు ఎంతో మంది తమకు ఆందోళనకు మద్దతు ప్రకటించారన్నారు. పార్లమెంటు సభ్యులు ప్రకాష్ జవదేకర్, వివేక్, ఆనంద్‌భాస్కర్, హన్మంతరావులు జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు జరుగుతున్న హక్కుల ఉల్లంఘన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. కానీ, జిల్లాకు చెందిన ఏ ఒక్క నాయకుడూ అటు తిరిగైనా చూడలేదని, పైగా జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కడుందని అంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కనీసం పౌష్టికాహారం, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ మండలానికి ఒక్కంటికి *200 కోట్లు అందిస్తే.. వాటిని ఫ్లోరైడ్ నివారణకు ఖర్చు చేయకుండా రాజకీయ నాయకులు పంచుకున్నారని విమర్శించారు. జలసాధన సమితి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం గురించి యావత్ తెలంగాణ నుంచి ఒత్తిడి వస్తుందని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని తెలి పారు. రచయితల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో అంజయ్య, దుబ్బ కొండమ్మ, అలుగుబెల్లి భిక్షారెడ్డి, మారం హేమచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక మన్యసీమ కావాలి
నగరంలోని జంతర్‌మంతర్‌లో ఆదివాసీల ధర్నా అలరించిన మన్యం నృత్యాలు సాక్షి, న్యూఢిల్లీ: మన్యసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆదివాసీ గిరిజన సంఘాల జాక్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలో వందల సంఖ్యలో ఆదివాసులు పాల్గొన్నారు. సంప్రదాయ వేషధారణలు, నృత్యాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. మన్యసీమ జాక్ ఏపీ కన్వీనర్ చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివాసీయుల పలు డిమాండ్లను నాయకులు ఏకరువు పెట్టారు. అంతకుముందు ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన గుసడి,గిరిజన కోయకొమ్ము నృత్యాలు జంతర్‌మంతర్‌కి వచ్చిన ఆందోళనకారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు నెమలిఈకలతో తయారు చేసిన టోపీలను ధరించి చేసిన గుసడి నృత్యానికి అక్కడున్నవారు కరతాళధ్వనులతో అభినందించారు. అనంతరం ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి వచ్చిన 50 మంది కళాకారులు గిరిజన కోయకొమ్ము డ్యాన్స్చేశారు. ‘అడవిలాన్వో నామనయినో.కొమ్ములేలో..(అడవిలోపుట్టి పెరిగా...)’అంటూ గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు.కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, కోడూరి నారాయణరావు,ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీయులు పాల్గొన్నారు.