లండన్‌లో టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవం
జగిత్యాల : టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ వార్షికోత్సవం లండన్ నగరంలో గురువారం ఘనంగా జరిగింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రం కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. ఆరేళ్లుగా పార్టీ ఎన్నారై శాఖను ముందుండి నడిపిస్తున్న అనిల్ కూర్మాచలంను అభినందించారు.
యూకే నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ నేత చాడ సృజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముందుగా ప్రొఫెసర్ జయశంకర్‌కు, అమరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఎన్నారై సెల్ గత ఆరేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై ఓ వీడియోను ప్రదర్శించారు. ఓయూ జేఏసీ అధ్యక్షుడు కరాటే రాజు హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శులు నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సెల్ యూకే ఇన్‌చార్జి విక్రమ్‌రెడ్డి, లండన్ ఇన్‌చార్జి రత్నాకర్, సభ్యులు సతీష్‌రెడ్డి, సంజయ్, హరి, మల్లారెడ్డి, సత్యపాల్, సత్యంరెడ్డి, రాజేష్ వర్మ, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్.కె, వినయ్, ప్రవీణ్, గణేశ్, నవీన్, వేణురెడ్డి, సత్య, రాకేష్, సీహెచ్. సత్య, రవి ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.