దినకరన్ ఏం చెబుతారో?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ నేడు ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి ఆయన బయలు దేరారు. ఢిల్లీ పోలీసులకు ఆయన ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాను ఎవరికీ ఇవ్వజూపలేదని ఇంతకుముందు దినకరన్ ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. శనివారం తమ ఎదుట హాజరుకావాలని బుధవారం అర్థరాత్రి దినకరన్కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకుల’ ను తమకే దక్కేలా చేసేందుకు ఎన్నికల అధికారికి రూ. 50 కోట్ల లంచం ఇవ్వజూపారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటకకు చెందిన సుఖేష్ చంద్రశేఖర్ అనే మధ్యవర్తిని ఈ నెల 17న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే సుఖేష్ ఎవరో తనకు తెలియదని దినకరన్ ఇంతకుముందు చెప్పారు.