మానుకోట ముంగిట్లో పసుపు గడప | turmeric crop in mahabubabad district | Sakshi
Sakshi News home page

మానుకోట ముంగిట్లో పసుపు గడప

Published Thu, Oct 20 2016 4:13 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

turmeric crop in mahabubabad district

పసుపు పంటకు కేరాఫ్‌ కేసముద్రం
రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు 
కొత్త జిల్లాతోమార్కెంటింగ్‌పై చిగురిస్తున్న ఆశలు
ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన క్రయవిక్రయాలు 
 
కేసముద్రం: పసుపు శుభసూచిక.. తెలుగింటి ప్రతి గడపలో స్వాగత గీతిక.. రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద గుళిక.. సౌందర్యాన్ని పెంచే స్వదేశీ ఫేస్‌ క్రీమ్‌.. గాయాలకు నిఖార్సయిన ఇంటి మందు. అలాంటి పసుపును మండలంలోని రైతులు దశాబ్దాల కాలంగా సంప్రదాయ పంటగా వేలాది ఎకరాల్లో సాగుచేస్తున్నారు. కేసముద్రం మార్కెట్‌లో ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన పసుపు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. 
 
నూతనంగా ఏర్పాౖటెన మానుకోట జిల్లాలో కేసముద్రం మండలం వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో కీలకంగా మారింది. పసుపు సాగులో మానుకోట జిల్లాకే మణిహారంగా మారింది. ఇక్కడ పసుపు సంబంధిత పరిశ్రమలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటవుతాయని, ఎంతోమందికి ఉపాధి కలుగుతుందనే కొత్త ఆశలు ఈ  ప్రాంతవాసుల్లో చిగురిస్తున్నాయి. 
 
కొనుగోళ్లు మొదలైంది ఇలా.. 
1965 కంటే ముందు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు పండించిన పసుపు పంటను ఎడ్లబండ్లపై మండల కేంద్రానికి తీసుకొచ్చి స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో, అప్పుడున్న రైస్‌ మిల్లు వద్ద రాశులుగా పోసి వ్యాపారులకు అమ్మేవారు. సరుకును బట్టి వ్యాపారి ధర నిర్ణయించి తర్వాత వెంటనే సదరు రైతు డబ్బులను తీసుకుని వెళ్లేవారు. ఈ క్రమంలోనే కల్వల గ్రామానికి చెందిన ఘంటా సత్తిరెడ్డి చొరవతో మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ను 1965 జనవరి 3న ఏర్పాటు చేశారు. మార్కెట్‌ ఏర్పడిన తర్వాత కూడా అదే పద్ధతుల్లో ప్రత్యక్ష పద్ధతిలో కొనుగోళ్లను కొనసాగించారు. దీంతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేసముద్రం మార్కెట్‌లో నేటికి ప్రత్యక్ష కొనుగోలు పద్ధతి కొనసాగుతోంది. 
 
మొదట ఆహర పంటలనే పడించడంలో శ్రద్ధవహించిన రైతులు, ఆ  తర్వాత సాగులో వచ్చిన మార్పులతో 1970లో వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపారు. ఆ రకంగా ఈ ప్రాంతంలో నేల స్వభావాన్ని బట్టి పసుపు సాగు చేయడం మొదలుపెట్టారు. 1980లో మార్కెట్‌లో పసుపు క్వింటాకు ధర రూ.200 పలికేది. రానురాను 2010లో క్వింటా పసుపునకు గరిష్ట ధర రూ.16 వేలు పలకడం పసుపు రైతుల ఇంట సిరులు కురిశాయి. వందల క్వింటాళ్ల నుంచి మొదలుకుని దాదాపు లక్షల క్వింటాళ్ల వరకు క్రయవిక్రయాలు జరగడం, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ప్రత్యక్ష పద్ధతిలో కోట్లాది రూపాయల్లో పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఇక్కడ 12 పాలిషింగ్‌ యూనిట్లు, 3 పౌడర్‌ మిల్లులు పనిచేస్తున్నాయి. 
 
సాగువిస్తీర్ణంలో పైచేయి
వరంగల్‌జిల్లాలో ఉన్నప్పుడు జిల్లావ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పసుపును సాగుచేయగా, ఒక్క మానుకోట డివిజ¯ŒSలోనే 10 వేల ఎకరాల్లో పసుపును సాగుచేస్తున్నారు. ఇక డివిజ¯ŒSవ్యాప్తంగా చూస్తే ఒక్క కేసముద్రం మండలంలోనే 5 నుంచి 6 వేల ఎకరాల్లో పసుపును సాగుచేస్తుండటం విశేషం. మానుకోట జిల్లాలో పసుపు సాగులో కేసముద్రం మండలానిదే పైచేయిగా ఉంది. కాగా ప్రస్తుతం ఈ ఖరీఫ్‌లో 5 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగుచేశారు. 
 
మానుకోట జిల్లాతో కొత్త ఆశలు
పసుపును అధికంగా పండిస్తున్న కేసముద్రంలో పసుపు పంటకు వచ్చే తెగుళ్లు, నివారణ, ఆధునీకరణ సాగు పద్ధతులతోపాటు ఇతరాత్ర అంశాలపై అవగాహన కల్పించడానికి పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ముఖ్యంగా మార్కెట్‌లో ధర హెచ్చుతగ్గులను బట్టి,  రైతులు పండించిన పసుపును భద్రపరచడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. గదుల్లో పసుపు నిల్వలు ఉంచడంతో వాటికి పురుగు పట్టే అవకాశం ఉంది. రక్షణ నిమిత్తం నెలనెలా రూ. 1000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా పసుపు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానుకోట జిల్లా ఏర్పాటుతో  ఇక్కడ పసుపును భద్రపరుచుకునేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లు, రాయితీలపై పరిశ్రమల ఏర్పాటు, పసుపు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement