శివమొగ్గ,న్యూస్‌లైన్ : శివమొగ్గ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగా,భద్రతోపాటు శరావతి, దండావతి, వరదా, కుమద్వతి, మాలతి నదులు ఉగ్రరూపం దాల్చాయి. వరదనీరు చుట్టుముట్టి పలు గ్రామాలతోపాటు భద్రావతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సొరబ తాలూకా ఆనవట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుమరికొప్ప గ్రామంలో కుండ పోత వర్షానికి ఓ ఇంటి గోడ కూలి మంజునాథ్(5) అనే బాలుడు మృతి చెందాడు.
ఇదే తాలూకా చంద్రగుత్తి మండలంలో కమకూరు గ్రామనివాసి మున్నప్ప(50)వరదనీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. భద్రా జలాశయం నుంచి ముందుజాగ్రత్త చర్యగా నీటిని దిగువకు విడుదల చేయడంతో భద్రావతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండు వెనుక భాగం నీట మునగడంతో వాహనరాకపోకలను మళ్లించారు. కవలుగుంది గ్రామంలోకి వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై గ్రామస్తులను సమీపంలోని పాఠశాలకు తరలించి అక్కడ గంజికేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సాగర తాలూకా తమిడికొప్ప చెరువు పొంగి పొర్లింది. దీంతో చెరువు పక్కనే ఉన్న రహదారి నీటమునిగి వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శికారిపుర తాలూకా గౌరిహళ్ల చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో శికారిపుర-సొరబ ప్రధానరహదారి జలమయమైంది.సొరబ తాలూకాలో వరదానది పరవళ్లు తొక్కడంతో వందలాది ఎకరాల్లోకి వరదనీరు చొరబడి పంటలు నీటమునిగాయి. వరదల కారణంగా శివమొగ్గ తాలూకా గాజనూరులోని తుంగాజలాశయం కళకళలాడుతోంది. జలాశయంలోకి ఇన్‌ప్లో 61,131 క్యూసెక్కులుగా ఉండగా 60,352 క్యూసెక్కుల నీటిని హొస్పేట తుంగభద్రా డ్యామ్‌కు విడుదల చేస్తున్నారు.
భద్రా జలాశయం ఇన్‌ప్లో 44,665 క్యూసెక్కులుగా ఉండగా 61, 646 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాతహొన్నూరు సమీపంలోని తుంగా, భద్రా నది సంగమ స్థలం సముద్రాన్ని తలపిస్తోంది. లింగమనక్కి జలాశయ గరిష్టనీటిమట్టం 1819 అడుగులు కాగా ప్రస్తుతం 1816.75 అడుగులకు చేరుకుంది. 67,478 క్యూసెక్కులు డ్యాంలోకి వస్తుండగా 57,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జోగ్ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. 24గంటల వ్యవధిలో శివమొగ్గ తాలూకాలో 21.4 మిల్లీమీటర్లు, భద్రావతిలో 18.6, తీర్థహళ్లిలో 47.6, సాగరలో 16.8 , శికారిపురలో 5.6, సొరబలో 29.2, హొసనగర తాలూకాలో 82.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
Published Sun, Aug 4 2013 5:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement