పుణే: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సామాజిక కార్యకర్త నరేంద్ర దభోల్కర్ హత్యకేసులో ఇద్దరు నిందితులను జనవరి 28వ తేదీవరకు పోలీసు కస్టడీకి పంపుతూ మంగళవారం స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. దభోల్కర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటున్న వికాస్ ఖాండేల్‌వాల్, మనీష్ నగోరిలను మంగళవారం స్థానిక ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎ.బి.షేక్ ఎదుట హాజరు పరిచా రు. వేరే కేసుకు సంబంధించి ఇప్పటికే ఠాణే జైలులో ఉన్న వీరిద్దరినీ సోమవారం పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సిటీ బ్రిడ్జి వద్ద గత ఏడాది ఆగస్టు 20వ తేదీ ఉదయం వేళ దభోల్కర్‌ను ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తుపాకితో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకిత్తంచడంతో పోలీసులు సవాలుగా స్వీకరించారు. అయితే, ఈ కేసులో నేరం ఒప్పుకోమని తన కక్షిదారులకు మహారాష్ట్ర ఏటీఎస్ రూ.25 లక్షలు ఇవ్వజూపిందని నిందితుల తరఫు న్యాయవాది వాదించాడు. కాగా, దభోల్కర్ హత్యకు వాడిన బుల్లెట్లు, నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్‌కు సంబంధించినవేనని ప్రభుత్వ న్యాయవాది మహదేవ్ పాల్ వాదించారు. ఈ హత్యకు సంబంధించి వెనుక ఉన్నదెవరో ఛేదించాల్సి ఉందన్నారు. కాగా, నిందితుల తరఫు న్యాయవాది బి.ఎ.ఆలూర్ మాట్లాడుతూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న కేసులో ఇప్పటికే ఠాణే జైలులో ఉన్న తన కక్షిదారులను 52 రోజుల పాటు విచారణ జరిపినా, దభోల్కర్ హత్యతో వారికి గల సంబంధాన్ని ఏటీఎస్ పోలీసులు నిరూపించలేకపోయారన్నారు. అలాగే నేరం జరిగిన రోజు నిందితులిద్దరూ నగరంలో లేరని, అయినా నేరం చేసినట్లు ఒప్పుకుంటే రూ.25 లక్షలు ఏటీఎస్ చీఫ్ రాకేష్ మారియా ఇస్తామన్నారని వాదించారు.
కాగా, నిందితులను కేసు విషయమై న్యాయమూర్తి ప్రశ్నించగా.. తమను ఏటీఎస్ పోలీసులు కేసులో ఇరికిస్తున్నారని ఆరోపించారు. హత్య చేసినట్లు ఒప్పుకుంటే సొమ్ము ఇస్తామని ఏటీఎస్ అధికారులు ఆశ చూపారని చెప్పారు.‘మమ్మల్ని ఈ కేసులో ఇరికించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వేరే కేసుకు సంబంధించి ఠాణే కోర్టులో ఉన్న మాపై దభోల్కర్ హత్య కేసును బనాయించారు. నేరం ఒప్పుకోవాలని తీవ్రంగా హింసించారు. థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించారు. లైడిటెక్టర్ పెట్టి విచారణ జరిపారు. దభోల్కర్ కేసులో మేం నిర్దోషులం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మమ్నల్ని పోలీసులు ఈ కేసులో ఇరికిస్తున్నారు...’ అంటూ వారు న్యాయమూర్తి ముందు వాపోయారు. కాగా, దభోల్కర్ హత్యకు ఉపయోగించిన ద్విచక్రవాహనం ఎక్కడిది.. నిందితులకు కేసుతో ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి పోలీస్ కస్టడీకి అప్పగించాలని విచారణ అధికారి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేంద్ర భామ్రే కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 28వ తేదీవరకు నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించారు.
ఇద్దరికి పోలీస్ కస్టడీ
Published Wed, Jan 22 2014 12:08 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement
Advertisement