ఇద్దరు ఐఎస్ తీవ్రవాదుల అరెస్ట్
అనుమానంతో నలుగురు
యువకుల విచారణ
దసరా సంబరాల్లో
భారీ విధ్వంసానికి కుట్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: దసరా, దీపావళి సంబరాల్లో భారీ విధ్వంసాలకు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ పన్నిన కుట్రను ఎన్‌ఐఏ అధికారులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు కేరళలోనూ, మరొకరు తిరునెల్వేలిలోనూ పట్టుబడ్డారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఒక యువతి సహా మొత్తం 21 మంది కనిపించకుండా పోయారు. వారిని సెల్‌ఫోన్లలో సంప్రదించగా తాము ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సిరియాకు చేరుకుని ఐసిస్ తీవ్రవాద ముఠాలో చేరామని, తమకు వెతకవద్దని తెలపడంతో బంధువులు కుప్పకూలిపోయారు.
తమ వారిని తీవ్రవాద ముఠా నుండి విడిపించాలని కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ నేరపరిశోధన విభాగం(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగి కొత్తగా ఐఎస్‌లో చేరిన వారి నేపథ్యం, వారు ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకున్న మార్గం, వారిని పంపేందుకు ఏర్పాట్లు చేసిన ఏజెంటు ఎవరు తదితర అంశాలపై విచారణ ప్రారంభించింది. కేరళలో ఉంటూ ఐఎస్‌లో సభ్యులను చేర్చేలా కొందరు పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. కొండ ప్రాంత గ్రామీణ యువతీయువకులకు బ్రెయిన్ వాష్ చేసి ఐఎస్‌లో చేరుస్తున్న విషయం వెలుగు చూసింది.
సిరియా చేరగానే వారికి అక్కడ తీవ్రవాద కార్యకలాపాలపై శిక్షణనిచ్చి ఆ తరువాత భారతదేశానికి పంపి వారి ద్వారా విధ్వంసానికి పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. ఐఎస్ తీవ్రవాదుల సంచారాన్ని పసిగట్టిన అధికారులు రెండు వారాల క్రితం తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై అత్యంత రహస్యంగా నిఘాపెట్టారు. స్థానిక ప్రభుత్వాల సహాయంతో కొండ ప్రాంత గ్రామాల్లోని ప్రజల కదలికలపై కన్నేశారు. కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లా కనకమలైలో ఈ నెల 2వ తేదీన(ఆదివారం) ఐఎస్ తీవ్రవాదుల సమావేశం జరుగుతున్నదని, అందులో కేరళ, తమిళనాడుకు చెందిన యువకులు పాల్గొంటున్నారని అధికారులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల సహాయంతో భద్రతా దళం అధికారులు ఆదివారం రాత్రి ఆ ప్రాంతాన్ని సాయుధ బలగాలతో చుట్టుముట్టారు.
అక్కడ పట్టుబడిన వారందరినీ రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు ఐఎస్ తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఐఎస్ తీవ్రవాదుల్లో యూసుఫ్ అనే వ్యక్తి చెన్నై కొట్టివాక్కంలో నివసిస్తున్నట్లు తెలుసకున్నారు. పట్టుబడిన ఆరుగురు తమిళనాడు, కేరళలో విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఇదిలా ఉండగా తిరునెల్వేలి జిల్లా కడయనల్లూరులో ఐఎస్ తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడు దాక్కుని ఉన్నట్లు విచారణలో బయటపడింది. దీంతో రాత్రికి రాత్రే కడయనల్లూరుకు చేరుకున్న అధికారులు సుబహాని అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సుబహాని తన తండ్రి ఖాజామొహిద్దీన్ కేరళలో వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. కొన్నాళ్లు తండ్రికి సహకరిస్తూ కేరళలో ఉండిన సుబహానీ ఆ తరువాత కడయూరుకు వచ్చి బంగారు దుకాణంలో గుమాస్తాగా చేరాడు. సుబహాని కేరళలో పనిచేస్తున్నపుడు ఐఎస్ ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు అనుమానిస్తున్నారు. పట్టుబడిన ఆరుగురిలోని అబూబషీర్ అలియాస్ రషీద్ కోయంబత్తూరుకు చెందిన వాడు, కోవైకి చెందిన నవాజ్, నవాజ్‌ఖాన్, ఉబైసుల్ రహ్మాన్, నబీ అనే యువకులతో పరిచయాలు ఉన్నట్లు తేలింది.
దీంతో 20 మందితో కూడిన ఎన్‌ఐఏ అధికారుల బృందం ఆదివారం రాత్రి కోయంబత్తూరుకు చేరుకుని నవాజ్‌తోపాటు నలుగురి ఇళ్లపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఈ నలుగురు కేవలం ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే యూసుఫ్‌కు పరిచయం ఉన్నట్లు తెలుసుకుని వదిలివేశారు. ఎన్‌ఐఏ అధికారుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది.
ఐసిస్ కదలిక
Published Tue, Oct 4 2016 3:28 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement