♦ లోక్‌సభలో వెల్లడించిన ఉమాభారతి
♦ ఎంపీలు వైవీ,అవినాష్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి అంతంత మాత్రంగానే కొనసాగుతోందనీ డ్యామ్ ప్రాంతంలో భూమి పనులు 26 శాతం, కట్టల పనులు రెండు శాతం, కాంక్రీటు పనులు 4 శాతం ఇప్పటి వరకూ పూర్తయ్యాయనీ కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతి పునరుద్ఘాటించారు. అయితే 2018 మార్చికల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యమని తెలిపారు. ఆమె లోక్‌సభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా? అన్న ఎంపీల ప్రశ్నకు కేంద్ర మంత్రి నేరుగా జవాబివ్వలేదు. ముందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ను 2018 మార్చి నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యమని మాత్రమే తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అందించిన సమాచారం ప్రకారం పోలవరం డ్యామ్ ప్రస్తుత పనుల వివరాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు.