యమునా ఎక్స్‌ప్రెస్ వేపై పోలీసు నిఘా | Uttar Pradesh government is taking measures to increase police surveillance of the Yamuna Expressway | Sakshi
Sakshi News home page

యమునా ఎక్స్‌ప్రెస్ వేపై పోలీసు నిఘా

Published Wed, Jan 1 2014 10:57 PM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM

Uttar Pradesh government is taking measures to increase police surveillance of the Yamuna Expressway

గ్రేటర్ నోయిడా: యమునా ఎక్స్‌ప్రెస్ వే పోలీసు నిఘాను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ రహదారిలో వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం, అధిక వేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడటం, ఆయా ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై కేసు నమోదుచేసుకునే విషయంలో పోలీసుల మధ్య అంతరం రావడం తదితర అంశాలన్నింటినీ పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఇందుకోసం అంకిత భావంతో పనిచేసే పోలీసు బృందాన్ని ఈ నెలాఖరులోగా నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వ అధికారులు, హైవే అథారిటీ సభ్యుల మధ్య లక్నోలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు చొరవ తీసుకుంటోంది. 
 
 అంతా సవ్యంగా సాగితే ఈ నెలాఖరులోగా హైవేపై పటిష్టమైన పోలీసు బృందం విధులు నిర్వర్తించే అవకాశముంది. తద్వారా వేలాది మంది ప్రయాణికుల భద్రతకు భరోసా ఉంటుందని నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్ వే అథారిటీస్ చైర్మన్ రమ రమణ్ తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో ఉన్న ఈ హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు అధికార పరిధిపై ఆయా ప్రాంత పోలీసుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని చెప్పారు. ఇలాంటి సంఘటనలను నిలువరించి వ్యవస్థను సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు పోలీసుల సంఖ్యను పెంచాలని తెలిపారు. అధికార పరిధి విషయంలో పోలీసుల మధ్య తలెత్తుతున్న విభేదాలకు చెక్ పెట్టేందుకు 165 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవేను ప్రత్యేక జోన్ జిల్లాగా పరిగణించేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించే అవకాశముందని ఆయన వివరించారు. 
 
 సర్కిల్ అధికారులు, ఇన్‌స్పెక్టర్‌లు, సబ్ ఇన్‌స్పెక్టర్‌లు, కానిస్టేబుల్స్, ఇతర సిబ్బందితో ఉన్న పోలీసు బృందానికి సూపరింటెండెంట్  ఆఫ్ పోలీసు (ఎస్‌పీ) సారథ్యం వహిస్తారని రమ రమణ్ తెలిపారు. ఒక్కసారి ప్రత్యేక జిల్లా జోన్‌గా ప్రకటిస్తే ఈ హై స్పీడ్ లింక్‌పై శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న గౌతమ్ బుధ్ నగర్, బుల్దాన్‌సార్, మాతురా, హత్రాస్, అలీగఢ్, ఆగ్రా పోలీసులకు అధికారాలు ఉండవని చెప్పారు. సర్కిల్ అధికారుల నియామకంపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పోలీసులను కోరామన్నారు. గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రా వరకు మధ్యలో పోలీసు స్టేషన్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. అయితే హైవే వెంట విధులు నిర్వర్తించే పోలీసులకు గృహ వసతితో పాటు కార్యాలయ భవన సౌకర్యాలను కూడా కల్పిస్తామని తెలిపామన్నారు, ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై తగిన సంఖ్యలో పోలీసులు లేకపోవడంతో వారి డిమాండ్ల సాధన కోసం రైతులు కూడా రహదారిపై ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకునే సరికి ఆలస్యమవుతోందని, ఫలితంగా ప్రమాద నష్టం పెరగడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతోందని వివరించారు.
 
 ఈ రహదారిపై పోలీసులు లేకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా వాహన చోదకులు 150, అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్లడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఒకవేళ పోలీసు సంఖ్యను పెంచితే సురక్షిత ప్రయాణం ఆచరణ రూపంలోకి వచ్చే అవకాశముందని చెప్పారు. ‘ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు వచ్చే విదేశీ పర్యాటకులు ఈ హైవేపై పోలీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటకు 100 కిలోమీటర్ పోవాల్సినవారు అతివేగంతో వెళుతున్నారు. ఈ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు అధికార పరిధి గురించి పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. దీంతో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టాలంటే మంచి పోలీసులు నియమించడమే ఉత్తమ ఆలోచన అని’ ఒర్రిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అమిత్ గుప్తా అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement