తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మొత్తం 1.77 లక్షల మందికి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మంగళవారం తెలిపారు. 8వ తేది ఏకాదశినాడు 92,624మంది, ద్వాదశినాడు 84,482 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని చెప్పారు. 2015 సంవత్సరం కంటే ఈసారి 8వేల మూడు వందల మంది అధికంగా దర్శించుకున్నారని వివరించారు. 7వ తేది నుండి 9వ తేది వరకు రోజులో మూడుసార్లు వంతున సుమారు 10 లక్షల మందికి అన్నప్రసాదాలు, వేడిపాలు, కాఫీ, టీ అందజేశామన్నారు. రూ.36 లక్షల ఖర్చుతో 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ చేశామన్నారు. భక్తులకు రిసెప్షన్, ఆలయం, కల్యాణకట్ట, విజిలెన్స్‌తోపాటు అన్ని విభాగాల సిబ్బంది విశిష్ట సేవలందించారన్నారు.
శ్రీవారికి రూ.21.16 లక్షల విరాళాలు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి మంగళవారం రూ.21.16 లక్షల విరాళం అందింది. ఇందులో అన్నప్రసాదం ట్రస్టుకు రూ.9.15 లక్షలు, ప్రాణదానం కోసం రూ.లక్ష, స్విమ్స్‌కు రూ.10 లక్షలు, విద్యాదానం కింద రూ.1.01 లక్షలు అందాయి. భక్తులు డీడీల రూపంలో వీటిని విరాళాల విభాగంలో అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ రెడ్డి, ఆయన మనవరాలు ఉపాసన (నటుడు రాంచరణ్ సతీమణి), వైఎస్సార్‌సీపీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పార్లమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రకాంత్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.