సిలికాన్ సిటీలో టైర్ పంక్చర్ మాఫియా
బెంగళూరు : సిలికాన్ సిటీలో పంక్చర్ మాఫియా హడలలెత్తిస్తోంది. రోడ్లుపై తమ వాహనాల్లో ఒకటి, రెండు కిలోమీటర్లు వెళ్లగానే వాహనాలు పంక్చర్ అవుతున్నాయి. ఇక చేసేది లేక రోడ్డుపై అటు, ఇటు చూడగానే కూతవేటు దూరంలో మనకు పంక్చర్ దుకాణం కనబడుతుంది. ఈ సమస్య బెంగళూరులో కేవలం ఒకరిద్దరికి ఎదురయ్యే సమస్య కాదు ప్రతినిత్యం ఇలాంటి ఘటనలు వేలమంది అనుభవిస్తున్నారు. బీబీఎంపీ రోడ్లు అధ్వానకరంగా మారడంతోనే తమకు ఇలాంటి పరిస్థితి ఎదురౌతుందని భావిస్తే అది మీతప్పే అవుతుంది. మీ వాహనం, బైక్ పదే, పదే టైర్ పంక్చర్ అవుతుండటం మీకు దగ్గరలోనే పంక్చర్ దుకాణం ఉండటం కాకతాళీయం కాదు.
దీని వెనుక నగరంలో పంక్చర్ మాఫియా హస్తం ఉండటం నిజం. ఇది ఏంటి పంక్చర్ మాఫియా అంటే పంక్చర్ షాప్ ఉన్న ప్రదేశాల్లోని రోడ్లు, సర్కిల్స్ వద్ద ఇనుక కమ్మీ మేకులు వేసి వాహనాలను పంక్చర్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు తమ షాపుల వద్దకు విచ్చేయడం అంతేగాక ఒక పంక్చర్‌కు కనీసం రూ.80 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ మూడునాలుగు పంక్చర్లు అయితే మాత్రం కనీసం రూ.250, 300 ముట్టజెప్పాలి. ఇలా చేస్తూ ప్రతినిత్యం వాహనాలకు పంక్చర్ చేసి చేతుల నిండా డబ్బు సంపాదించడమే పంక్చర్ మాఫియా ద్యేయం.
ఎలా వెలుగులోకి వచ్చింది...
బనశంకరి నివాసి బెనడిక్ట్ జిబాకుమార్ ప్రతినిత్యం తన సైకిల్‌పై 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డులో కార్యాలయానికి వెళతారు. పదే, పదే సైకిల్ పంక్చర్ కావడం ఇతడికి పెద్ద తలనొప్పిగా మారింది. ఏంటిది నిత్యం సైకిల్ పంక్చర్ అవుతుందని సైకిల్ ను పంక్చర్ దుకాణం వద్దకు వెళ్తే అక్కడ వెలుగుచూసింది పంక్చర్ మాఫియా. పంక్చర్ అయిన స్థలంలో గాలించగా అక్కడ 15కు పైగా ఇనుక మేకులు కనబడ్డాయి. దీని ఆధారంగా పంక్చర్ మాఫియా కనిపెట్టాలని బెనడిక్ట్ జిబాకుమార్ నిర్ణయించుకున్నాడు. హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్–బీడీఏ బ్రిడ్జ్ సమీపంలో ప్రతినిత్యం అక్కడ గాలించగా 15–20 మేకులు లభించాయి.
మేకులు దొరికిన ప్రాంతంలో ఉన్న పంక్చర్‌షాప్ నిత్యం బిజీగా ఉండటం, రోడ్డులో లభించిన మేకులను షాప్ వద్ద ఉన్న వాటిని గమనించగా దీనికి పంక్చర్‌షాప్ కారణమని తెలిసింది. ఎలాగైనా చేసి పంక్చర్‌మాఫియా అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్న బెనడిక్ట్ గత 2015 నుంచి ఫేస్‌బుక్‌లో మైరోడ్, మై రెస్పాన్సిబిలిటీ అనే పేజీ తెరిచారు. అందులో ప్రతినిత్యం ఇతను సేకరించిన ఇనుక మేకులను నమోదు చేశారు. ఇంతవరకు ఇతను సేకరించిన ఇనుక మేకులు మొత్తం 70 కిలోలు. బెనడిక్ట్ తమ నివాసాన్ని తమిళనాడులో పెట్టారు. కాని పంక్చర్‌మాఫియా మాత్రం అదేవిధంగా కొనసాగుతుంది. ట్రాఫిక్‌పోలీసులు మేల్కొని కొన్ని ప్రదేశాల్లో పంక్చర్ మాఫియాకు అడ్డుకట్టవేసి వారిని అరెస్ట్ చేసి చర్యలు చేపట్టింది.