
కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారని వైఎస్‌ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఆయన పార్టీలో చేరారు. అనంతరం వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దొంగలెక్కల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోందని, అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ అన్నారు. ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని, అందుకే తాను వైఎస్ఆర్ సీపీలో చేరానని చెప్పారు.
మోసాలతో బాబు పాలన: పార్థసారథి
వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. వేలకోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, బడా వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పారిశ్రామికవేత్తల మెప్పుకోసం తాపత్రయపడుతున్నారని, తమ తప్పులు, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో విజయవాడలో 40 ఆలయాలను కూలగొట్టారని, అయినా బీజేపీ మాట్లాడే పరిస్థితిలో లేదని పార్థసారథి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తన గొప్పేనని చెప్పుకుంటున్న చంద్రబాబు పర్యవసానాల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కడతారు: మేకా వెంకటప్రతాప్ అప్పారావు
వచ్చే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్ సీపీలోకి క్యూ కడతారని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు అన్నారు. టీడీపీ సీనియర్లు కూడా వైఎస్‌ఆర్ సీపీలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను చంద్రబాబు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.