మదన్‌పై మరో ఫిర్యాదు
తమిళసినిమా: వేందర్ మూవీస్ నిర్మాత మదన్‌పై ఎస్‌ఆర్‌ఎం అధినేత పచ్చముత్తు తరఫున పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. మదన్ గత నెల 27న ఐదు పేజీల లేఖ రాసి మీడియాకు విడుదల చేసి కాశీలో ప్రాణాలు వదులుతానని చెప్పి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానంటూ వారి తల్లిదండ్రుల వద్ద ఫీజులు వసూలు చేసి ఆ డబ్బు అంతా కళాళాల నిర్వాహకానికి అప్పజెప్పినట్లు మదన్ లేఖలో పేర్కొన్న విషయం, తమకు ఎలాంటి డబ్బు అప్పగించలేదని కళాశాల అధినేత పచ్చముత్తు ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పచ్చముత్తు ఇంటి ముందు ఆందోళనకు దిగారు.అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదన్ ఇద్దరు భార్యలు,తల్లి కూడా పోలీస్ కమిషనర్‌కు పిర్యాదు చేశారు. మదన్ కేసు ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో ఉంది.హైకోర్టు ఆదేశాల మేరకు మదన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసుల బృందం ఆయన కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది.
మదన్‌ను పోలీసులు పట్టుకున్నారని, రహస్యంగా విచారిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే మదన్ ఆచూకీ ఇంకా లభించలేదన్నది పోలీసులు అధికారికంగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌ఎం కళాశాల అధినేత పచ్చముత్తు తరఫున బాలు అనే న్యాయవాది మంగళవారం పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో మదన్‌పై మరో ఫిర్యాదు చేశారు. అందులో చిత్ర నిర్మాత మదన్ ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో సీటు ఇప్పిస్తానని చెప్పి 102 మంది వద్ద డబ్బు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు,పలు కోట్ల రూపాయలతో పరారయినట్లు పేర్కొన్నారు. అయితే అతని మోసానికి తమకు ఎలాంటి సంబంధం లేదని,తమ సంస్థ పేరును వాడుకుని మదన్ మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.