సరితావిహార్ అండర్‌పాస్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు సరితావిహార్ అండర్‌పాస్ వాహనచోదకులకు అందుబాటులోకి వచ్చింది. నోయిడా, ఓఖ్లా మధ్య సరితావిహార్ వద్ద నిర్మించిన 1,090 మీటర్ల పొడవు అండర్‌పాస్‌ను కేంద్ర పట్టణాభివద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఢిల్లీ రోడ్లపైరద్దీని తగ్గించడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.2010లో అండర్‌పాస్ నిర్మాణం పూర్తి కావలసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని జాప్యం చేసిందని, ఫలితంగా నిర్మాణ వ్యయం పెరిగిందని ఆయన చెప్పారు. ప్రజల సొమ్ము వృధా కావడం చూసిన తమ ప్రభుత్వం కొద్ది నెలల్లో అనేక సమావేశాలు జరిపి పనులు జరిగేలా చూసిందని మంత్రి చెప్పారు. రానున్న ఎన్నికలకు, అండర్‌పాస్ ప్రారంభోత్సవానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
తగ్గిన దూరాభారం
ఈ అండర్‌పాస్ వల్ల నోయిడా, ఓఖ్లాల మధ్య ప్రయాణ దూరం కనీసం 8 కిమీలు తగ్గింది. మెట్రో నిర్మాణం కారణంగా ఆశ్రం చౌక్ వద్ద ఎదుర్యే ట్రాఫిక్ జామ్ సమస్యకు కూడా పరిష్కారం లభించింది. బదర్‌పుర్ నుంచి నోయిడాకు వెళ్లే వాహనాలు ఇక ఆశ్రమ్‌చౌక్‌కు రానవసరం లేదు. సరితావిహార్ నుంచి ఓఖ్లా వెళ్లడానికి ఇప్పటి వరకు 9 కిమీల దూరం ప్రయాణించవలసి వచ్చేది. ఈఅండర్‌పాస్ వల్ల ఈ దూరం ఒక కిమీలకు ప్రయాణసమయం 45 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గింది. ఈ అండర్‌పాస్‌లో వచ్చి, వెళ్లేందుకు మూడేసి లేన్ల చొప్పున మొత్తం ఆరు లేన్లు ఉన్నాయి. 5.5 మీ ఎత్తున్న అండర్‌పాస్‌లో నీరు చేరకుండా ఉండడం కోసం మూడు పంపులను ఏర్పాటు చేసినట్లు డీడీఏ ఇంజనీరు చెప్పారు.
జాప్యం మిలా..
2008లో డీడీఏ, రైల్వే కలిసి సరితావిహార్ అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించాయి. రూ.121 కోట్ల ఖర్చుతో అండర్‌పాస్ నిర్మాణం జరపాలని నిర్ణయించారు. కానీ పనులు మొదలు పెట్టడమే మూడేళ్ల ఆలస్యంగా జరిగింది. ముందనుకున్నట్లుగా 21 నెలల్లో 2013 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 242 కోట్ల రూపాయలైంది.
ప్రారంభోత్సవం బీజేపీ ఘనత కాదు
అండర్‌పాస్ ప్రారంభోత్సవాన్ని బీజేపీ తన ఘనతగా చెప్పుకోవడాన్ని ఓఖ్లా మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ విమర్షించారు. ఓఖ్లాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. అండర్‌పాస్ నిర్మాణానికి కృషి చేసిన తనను పక్కన బెట్టి తూర్పు ఢిల్లీ ఎంపీ మహేష్ గిరీ, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూడీ ప్రారంభోత్సవ శిలా ఫలకం మీద తమ పేరు కూడా చెక్కించుకున్నారని ఆయన ఆరోపించారు.