మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య ఆధిపత్య పోరు
అమలాపురం :మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య అమలాపురం నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఫ్లెక్సీల ఏర్పాటుతో మొదలైన వివాదం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఆల్డా) చైర్మన్ యాళ్ల దొరబాబుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీ కార్యకర్తల వరకూ విస్తరించింది. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంగా అధికారపార్టీ నాయకులు అల్లవరం ఎస్సైపై బదిలీ వేటు వేయించగా, దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలతో మిత్రభేదం మరింత తీవ్రతరమైంది.అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన దొరబాబు ఇటీవల బీజేపీలో చేరారు.
ఇందుకు మద్దతు తెలుపుతూ దొరబాబు అనుచరులు కొమరగిరిపట్నం సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని తొలగించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఫ్లెక్సీల వ్యవహారంలో ఎమ్మెల్యే ఆనందరావు, దొరబాబు వ్యక్తిగత పట్టుదలలకు పోవడంతో అది కాస్తా రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిని ఒకరు సవాలు చేసుకునేందుకు దారి తీసింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఉందని పోలీసులు తొలగింపునకు వెనకడుగు వేయగా, టీడీపీ నేతలే వాటిని తొలగించారు. ఈ నేపథ్యంలో అల్లవరం ఎస్సై రాజేష్‌కుమార్‌ను జిల్లాలో కొత్తగా చేరిన మోతుగూడెం స్టేషన్‌కు బదిలీ చేశారు. హడావిడిగా జరిగిన ఈ బదిలీకి ఫ్లెక్సీ వివాదంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న అధికారపార్టీ నేతల కక్షసాధించే కారణమని బీజేపీ వారు భావిస్తున్నారు.
బీజేపీని అణచాలని చూస్తున్నారు..
ఎమ్మెల్యే ఆనందరావు తీరుపై జిల్లా బీజేపీ నాయకులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని శనివారం భీమవరంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీల విషయంలో ఆనందరావు బీజేపీ నాయకుల పట్ల వ్యవహరించిన తీరు, కార్యకర్తలపై కేసులు పెట్టించడం వంటి విషయాలను దొరబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నాయుడు తదితరులు కేంద్ర మంత్రికి వివరించారు. మిత్రపక్షమై ఉండీ ఎమ్మెల్యే తమను శత్రువులుగా చూస్తున్నారని నిరసించారు. మోదీ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేయడమే కాక గ్రామంలో బీజేపీకి క్యాడర్ లేకుండా చేసేం దుకు, పార్టీని ఎదగనివ్వకుండా అణచేసేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుశ్చర్యలను అడ్డుకున్నందుకే ఎస్సైకి అన్యాయంగా బదిలీ చేశారని చెప్పారు.
జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలను అందజేశారు. ఎమ్మెల్యే ప్రత్యేకించి ఓ సామాజికవర్గాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. తాము చెప్పిన దానిపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్టు ఆల్డా చైర్మన్ దొరబాబు స్థానిక విలేకరులకు తెలిపారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ ఫిషర్‌మెన్ సెల్ కన్వీనర్ కర్రి చిట్టిబాబు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, మత్స్యకార సంఘ నాయకుడు మల్లాడి హనుమంతరావు, పార్టీ నాయకులు పాలూరి సత్యానందం, బసవా చినబాబు, బసవా సింహాద్రి ఉన్నారు.
రగడను పట్టించుకోని రాజప్ప
మిత్రుల మధ్య రగులుతున్న చిచ్చును చల్లార్చేందుకు టీడీపీ జిల్లా నాయకులు కనీసంగా ప్రయత్నించకపోవడం గమనార్హం. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గమైన అమలాపురంలో బీజేపీ, టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు దిగుతున్నా ఆయన జోక్యం చేసుకోకపోవడం క్యాడర్‌ను విస్మయానికి గురి చేస్తోంది.