దయనీయ స్థితిలో మనోరమ
సీనియర్ నటి మనోరమ ఆరోగ్య పరిస్థితి క్షీణించి, దిక్కు లేకుండా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఆమెనెవరూ పట్టించుకోవడంలేదని నటుడు మన్సూర్ అలీఖాన్ వాపోయారు. సహస్రాధిక చిత్రాల్లో నటించి చరిత్రకెక్కిన బహుభాషా నటి మనోరమ. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించి రక్తి కట్టించే నటధీశాలి మనోరమ. ఆ మధ్య బాత్‌రూమ్‌లో కాలుజారి పడినప్పటి నుంచి మనోరమ అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. మూత్రనాళ సమస్యతో బాధపడుతున్న మనోరమ కొన్ని నెలల క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
అయితే మూత్రనాళ సమస్య నుంచి ఆమె కోలుకోలేదు. ఈ విషయం గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ వెల్లడిస్తూ ఎంజీఆర్, శివాజీ కాలం నుంచి మనోరమ నటిస్తురన్నారు. ఈ తరం నటులతో కూడా నటించారని తెలిపారు. కొంతకాలం క్రితం మూత్రనాళ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరిన మనోరమ మళ్లీ అదే సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే ఆమెనెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించలేదని తెలిపారు.
తాను తన కూతురు వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికి ఇటీవల మనోరమ ఇంటికి వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి గుండె బరువెక్కిందన్నారు. మనోరమ వెయ్యి చిత్రాలకు పైగా నటించి కోట్లాది రూపాయలను సంపాదించారని, ఇప్పటికీ ఆమె ఆస్తులు కోట్ల విలువ చేస్తాయన్నారు. అయినా ఆమెను ఆస్పత్రిలో చేర్చే దిక్కు లేకపోవడం విచారకరం అన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ మనోరమపై ప్రేమాభిమానాలు కలిగి వున్నారని ఆమెను ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తే, మనోరమ మరి కొంత కాలం ఆరోగ్యంగా జీవించగలరని మన్సూర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు.