
బినామీ ఖాతాల్లో డిపాజిట్లు : కాలేజీ చైర్మన్ అరెస్ట్!
విజయవాడ : నల్లడబ్బును మార్చుకునేందుకు ఓ ప్రైవేటు బ్యాంక్ సహకారంతో బినామీ అకౌంట్లు తెరిచి, డిపాజిట్‌లు చేసిన ఓ కాలేజీ చైర్మన్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వన్‌టౌన్‌లోని మహాత్మా గాంధీ మహిళా కళాశాల చైర్మన్ కాంతారావు తన వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు వ్యూహాన్ని రచించాడు.
అందులో భాగంగా వన్‌టౌన్‌లోని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్లో కాలేజీ సిబ్బంది పేరుతో బినామీ ఖాతాలు తెరిచాడు. ఆయా ఖాతాల్లో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేశారు. దీంతో మహిళా అధ్యాపకుల మొబైల్స్కు సొమ్ము డిపాజిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీనిపై ఓ అధ్యాపకురాలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సూత్రధారి కాంతారావు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కళాశాల చైర్మన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు సహకరించిన బ్యాంక్ అధికారులతో పాటు దీని వెనక ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.