ఘరానా మోసం
43 బినామీ ఖాతాలతో రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్
ఆలస్యం వెలుగు చూసిన వైనం
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
శివమొగ్గ:బ్యాంక్‌లో బినామీ ఖాతాలు సృష్టించి రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... శివమొగ్గలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో మేనేజర్‌గా పనిచేస్తున్న గణపతి ముంగ్రి తన బంధువుల పేరుతో 43 బినామీ ఖాతాలు తెరిచి వీటి ద్వారా రూ. 2.16 కోట్లను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు మొత్తం బయటి వ్యక్తులకు రుణాలుగా ఇచ్చారని, వాటిని ఇప్పటి వరకు కట్టలేదని ఆడిట్ అధికారుల వద్ద బ్యాంక్ మేనేజర్ బుకాయించాడు.
దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి బ్యాంక్ ఏజీఎం ఇటీవల జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని జిల్లా ఎస్పీ రవి.డి.చెణ్ణన్నవర్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందుకోసం జిల్లా ఏసీపీ ఎస్.విష్ణువర్ధన్‌ను ఆయన నియమించారు. కాగా, ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.