
విధేయులకే పెద్ద పీట
= కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం
= మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, బోర్డులు, కార్పొరేషన్ల నియామకాల్లో పార్టీ విధేయులకే పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌ను శనివారం ఇక్కడ కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , సమన్వయ సమితి సభ్యులు కేజే. జార్జ్, డీకే. శివకుమార్‌లు కలుసుకున్నప్పుడు పలు అంశాలపై చర్చ జరిగింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున వీలైనంత త్వరగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని, కార్పొరేషన్లు, బోర్డులకు చైర్మన్‌ల నియామకాన్ని పూర్తి చేయాలని దిగ్విజయ్ సింగ్ సూచించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలకు ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థులతో జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపాలని పరమేశ్వరకు సూచించారు. గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ చీటికి మాటికి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడం సమావేశంలో ప్రస్తావనకు వ చ్చింది. దీనిపై దిగ్విజయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, ఆయనకు అలాంటి అవకాశం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సీఎంకు సలహా ఇచ్చారు.
సమన్వయ సమితి సమావేశం రద్దు
నగరంలో మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ సమన్వయ సమితి సమావేశం, అన ంతరం నగర శివార్లలోని రిసార్టులో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ బిల్లు, ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతునిచ్చే విషయమై అత్యవసరంగా చర్చించాల్సి ఉన్నందున తక్షణమే రావాలంటూ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిపోయారు.
శుక్రవారం రాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పిలుపు మేరకు వెళ్లాల్సి రావడంతో తాను బస చేసిన అతిథి గృహంలోనే సమన్వయ సమితి సభ్యులైన పరమేశ్వర, సీఎం, జార్జ్, శివ కుమార్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. మధ్యలో ఆయన గవర్నర్‌ను రాజ్ భవన్‌లో కలుసుకున్నారు. మంత్రుల పని తీరుపై ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తుండడంతో నష్ట నివారణకు భేటీ అయ్యారు. మున్ముందు ఇలా జరుగకుండా చూస్తానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.