విజయ్ ‘కత్తి’ కేసు వాయిదా
టీనగర్: నటుడు విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రకథ చోరీకి గురైనట్లు దాఖలైన కేసులో విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తూ తంజావూరు జిల్లా సెషన్సు కోర్టు ఉత్తర్వులిచ్చింది. చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన కత్తి చిత్రం గత ఏడాది విడుదలైంది. ఈ చిత్రం కథ తాను దర్శకత్వం వహించిన భూమి అనే డాక్యుమెంటరీ కథాంశం అని, తన కథను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చోరీ చేసినట్లు, ఇందుకు నష్ట పరిహారం చెల్లించాలని, వేరే భాషల్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసేందుకు స్టే విధిం చాలని తిరుకాట్టుపల్లి సమీపంలోగల ఇలంగాడు గ్రామం దిగువ వీధికి చెందిన అన్బువ రాజశేఖర్ (32) తంజావూరు జిల్లా సెషన్సు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటు డు విజయ్, నిర్మాతలు కరుణాకరన్, సుభాష్‌కరన్, చాయాగ్రాహకుడు జార్జి విలియమ్ అనే ఐదుగురిపై నేరం ఆరోపించారు. ఈ కేసు విచారణ తంజావూరు జిల్లా సెషన్సు న్యాయమూర్తి మహ్మద్ ఆలీ ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 15 వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి మహ్మద్ ఆలీ ఉత్తర్వులిచ్చారు.