
నాటు కోళ్ల పంపిణీ
నాటు కోళ్ల పెంపకం పథకానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 77 వేల మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. తలా 50 కోళ్లను అందజేయనుంది.
సాక్షి, చెన్నై : రాష్ట్ర పశు సంవర్థక శాఖ నేతృత్వంలో ఆవులు, మేకల పెంపకం, అభివృద్ధి పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పథకానికి ప్రత్యేకంగా నిధుల్ని కేటాయిస్తూ గ్రామీణ రైతులు, మహిళా లబ్ధిదారులకు ఆవుల్ని, మేకల్ని ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, రైతులకు నాటు కోళ్ల పెంపకం నిమిత్తం ప్రత్యేక ప్రోత్సహాన్ని అందిస్తోంది. తాజాగా నాటు కోళ్ల పెంపకం, ›గ్రామాల్లోని పేద మహిళల ఆర్థికాభివృద్ధి మెరుగు లక్ష్యంగా గత ఏడాది అసెంబ్లీ వేదికగా కొత్త పథకాన్ని సీఎం పళనిస్వామి ప్రకటించారు. తొలుత ఈ పథకం నిమిత్తం రూ.25 కోట్లు కేటాయించారు. అయితే, పథకం అమల్లో జాప్యం తప్పలేదు. ఈ దృష్ట్యా, అదనంగా మరో 25 కోట్లను అప్పగించారు. దీంతో 50 కోట్లతో తొలి విడతగా ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగింది. ఒక్కో పేద మహిళా లబ్ధిదారుకు 50 నాటు కోళ్లను పంపిణీ చేయడానికి నిర్ణయించారు.
శ్రీకారం
సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో సీఎం పళనిస్వామి నాటు కోళ్ల పెంపకం, పేద మహిళల ఆర్థికాభివృద్ధిని కాంక్షించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. పది మంది లబ్ధిదారులకు తలా యాభై చొప్పున నాటు కోళ్లను అందజేశారు. వీటి ద్వారా తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవాలని వారికి సీఎం పిలుపునిచ్చారు. తొలి విడతగా 77 వేల మంది మహిళా లబ్ధిదారులకు ఈ నాటు కోళ్ల పంపిణీ సాగనున్నది.
మరికొన్ని కార్యక్రమాలు
పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖలకు రాష్ట్రంలోని తేని, అరియలూరు, కోయంబత్తూరు, రామనాథ పురం, కడలూరుల్లో రూ.89 కోట్లతో నిర్మించిన క్వార్టర్సులు, పోలీసు స్టేషన్లు ఇలా అనేక నిర్మాణాలను సీఎం పళనిస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. చెన్నై ఎంఆర్‌సీ నగర్‌లో రూ.73 కోట్లతో నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల కోసం నిర్మించిన పరిపాలనా భవనాన్ని ప్రారంభించారు. ఇక, నాబర్డ్ నేతృత్వంలో జరిగిన సదస్సులో రైతుల ఆదాయ మార్గం పెంపునకు తగ్గ కార్యాచరణ, ప్రభుత్వ సహకారం గురించి సీఎం పళనిస్వామి ప్రసంగించారు. ఈకార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, సీనియర్ మంత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment