
విఐపీ రాజధాని
తమిళనాడుకు రాజధాని నగరంగా ఉన్న చెన్నై జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో హేమాహేమీలు ఎన్నికల్లో తలబడుతున్నారు. సీఎం జయలలిత, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, జాతీయ కార్యదర్శి హెచ్.రాజా, మాజీ డీజీపీ ఆర్ నటరాజ్‌లతో పాటు పలువురు ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు.
సాక్షి, చెన్నై: చెన్నై జిల్లా పరిధిలో డాక్టర్ రాధాకృష్ణన్ నగర్, పెరంబూరు, కొళత్తూర్, విల్లివాక్కం, తిరువీకానగర్(రి), ఎగ్మూర్(రి), రాయపురం, హార్బర్, చేపాక్కం-ట్రిప్లికేన్ , థౌజండ్ లైట్స్, అన్నానగర్, విరుగంబాక్కం, సైదాపేట, టీనగర్, మైలాపూర్, వేళచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యధిక స్థానాల్ని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు డీఎంకే కూటమి, ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక, తామూ పాగా వేస్తామంటూ బీజేపీ సిద్ధం కాగా, రేసులో దిగాం అన్నట్టుగా అభ్యర్థుల్ని ప్రజా సంక్షేమ కూటమి ప్రకటించి ఉన్నది. తెలుగు, తమిళం, బిహారి, రాజస్థానీ, మాళయాళీలు, కన్నడిగుల ఓటు బ్యాంక్‌తో పాటు ఉద్యోగ, కార్మిక, వీఐపీల ఓట్లతో నిండిన ఈ జిల్లాలో విజయ బావుటా ఎగుర వేయడం కోసం రాజకీయ పక్షాలు పరుగులు తీస్తున్నాయి.
డాక్టర్ రాధాకృష్ణన్ నగర్:
ఇది వీవీఐపీ నియోజకవర్గం. మళ్లీ అధికార పగ్గాలు లక్ష్యంగా పరుగులు తీస్తున్న సీఎం జయలలిత సిట్టింగ్ స్థానం. డీఎంకే అభ్యర్థగా సిమ్లా ముత్తు చోళన్ సీఎం జయలలితకు గట్టి పోటీ ఇచ్చేం దుకు సిద్ధమయ్యారు. డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి ఈ సాథనాన్ని వీసీకేకు అప్పగించడంతో ఆ పార్టీ తరఫున ప్రొఫెసర్ వసంతి దేవి పోటీ చేస్తున్నారు. ఇక, సీమాన్ నేతృత్వంలోని నామ్‌తమిళర్ కట్చి సి.దేవి అనే హిజ్రాను రంగంలోకి దించడం గమనార్హం.
పెరంబూరు:
సీపీఎం సిట్టింగ్ స్థానం ఇది. మళ్లీ గెలుపు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ సౌందరరాజన్ రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన డీఎంకే కూటమికి చెందిన పెరుందలైవర్ మక్కల్ కట్చి నేత ఎన్‌ఆర్ ధనపాలన్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా వెట్రివేల్ పోటీకి దిగారు.
విల్లివాక్కం:
గత ఎన్నికల్లో ఈ డీఎంకే కోట అన్నాడీఎంకే గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఓటమి చవిచూశారు. ఈ సారి ఆయన ఎన్నికలకు దూరంగా ఉండడంతో, గతంలో ఇదే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు అసెంబ్లీ మెట్లు ఎక్కిన రంగనాథన్ పోటీకి సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా దాడి ఎం రాసు ఢీ కొడుతున్నారు. అయితే, ఈ కంచుకోటను మళ్లీ గుప్పెట్లోకి డీఎంకే తీసుకునేనా అన్నది వేచిచూడాల్సిందే.
తిరువికానగర్(రి):
అన్నాడీఎంకే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వి నీలకంఠం మళ్లీ రేసులో దిగారు. డీఎంకే అభ్యర్థిగా శివకుమార్ పోటీ చేస్తున్నారు.
ఎగ్మూర్(రి):
డీఎంకేలో ఓటమి ఎరుగని యోధుడిగా ముందుకు సాగి, గత ఎన్నికల్లో డీఎండీకే డమ్మి అభ్యర్థి నల్లతంబి చేతిలో పరిధి ఇళుంవలది చావు దెబ్బ తిన్నారు. డీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నాడీఎంకేలో చేరిన ఆయనకు సీటు మళ్లీ దక్కింది. అయితే, ఈ సారి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు డీఎంకే తరఫున రవి చంద్రన్ రేసులో ఉన్నారు.
రాయపురం:
తిరుగులేని నాయకుడిగా అన్నాడీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే డి జయకుమార్ ఇక్కడ మళ్లీ రేసులో నిలబడ్డారు. వ్యక్తిగత పలుకుబడి, పార్టీ అండదండాలతో గెలుపునకు పరుగులు తీస్తున్నారు. ఆయన గెలుపునకు కల్లెం వేయడానికి డీఎంకే కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున మళ్లీ రాయపురం మనో రేసులో దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన రాయపురం మనో ఈ సారి గెలుపు లక్ష్యంగా ప్రత్యేక మేనిఫెస్టోను నియోజకవర్గానికి సిద్ధం చేసి ఉన్నారు. ఇక, కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థిగా తమిళమానిల కాంగ్రెస్‌కు చెందిన బిజుషాకో పోటీకి దిగారు.
హార్బర్:
డీఎంకే చేతిలో ఉన్న ఈ స్థానం గత ఎన్నికల్లో అన్నాడీఎంకే గుప్పెట్లోకి చేరింది. అన్నాడీఎంకే అభ్యర్థిగా కరుప్పయ్య గత ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం ఆయన అన్నాడీఎంకేకు దూరం అయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసన్ రేసులో నిలబడ్డారు. డీఎంకే తరఫున శేఖర్ బాబు బరిలోకి దిగారు. వ్యక్తి గత హవా, పార్టీ బలం కలిసి రానున్నడంతో గెలుపు కోసం పరుగులు తీస్తున్నారు.
చేపాక్కం -ట్రిప్లికేన్:
ఒకప్పుడు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిట్టింగ్ స్థానం. ఆయన తన మకాంను గత ఎన్నికల్లో తిరువారూర్‌కు మార్చారు. దీంతో డీఎంకే అభ్యర్థిగా అన్భళగన్ బరిలోకి దిగి విజయ ఢంకా మోగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా జె. అన్భళగన్ మళ్లీ రేసులో దిగగా, ఆయన్ను ఢీకొట్టేందుకు మైనారిటీ అభ్యర్థిగా నూర్జాహాన్‌ను అన్నాడీఎంకే రేసులో నిలబెట్టింది.
థౌజండ్ లైట్స్:
ఇది ఒకప్పుడు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సిట్టింగ్ స్థానం. తన మకాంను కొళత్తూర్‌కు స్టాలిన్ మార్చేయడంతో గత ఎన్నికల్లో డీఎంకేకు పతనం తప్పలేదు. అన్నాడీఎంకే అభ్యర్థిగా రేసులో నిలబడ్డ వలర్మతి మంత్రిగా ఎదిగారు. మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. డిఎంకే అభ్యర్థిగా సెల్వం పోటీలో ఉన్నారు.
అన్నానగర్:
డిఎంకే సీనియర్ ఆర్కాట్ వీరాస్వామి ఒకప్పుడు చక్రం తిప్పిన నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో కూటమి ధర్మానికి కట్టుబడికాంగ్రెస్‌కు అప్పగించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా రేసులో దిగిన గోకుల ఇందిర మంత్రి అయ్యారు. మళ్లీ ఇదే స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి డీఎంకే అభ్యర్థి మోహన్ మంత్రితో తలబడుతున్నారు.
విరుగ్గంబాక్కం:
ఈ నియోజకవర్గం వీఐపీ జాబితాలోకి చేరి ఉన్నది. బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ఆమెను ఢీ కొట్టేందుకు ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి మళ్లీ రేసులో ఉన్నా, అదృష్టం కలిసి వచ్చేనా అన్నది అనుమానమే. ఇక, డీఎంకే అభ్యర్థిగా ధన శేఖర్, అన్నాడీఎంకే అభ్యర్థిగా విరుగై వీఎన్ రవి రేసులో ఉన్నారు.
సైదాపేట:
అన్నాడీఎంకే వరుసగా ఇక్కడ విజయాలు సాధిస్తూ వస్తున్నది. రెండు సార్లు ఇక్కడ గెలిచిన సెంతమిళన్‌కు ఈ సారి సీటు దక్కలేదు. అన్నాడీఎంకే అభ్యర్థిగా సి పొన్నయ్య రేసులో ఉన్నారు. ఇక, ఈ సారి అన్నాడీఎంకే గుప్పెట్లో నుంచి ఈ స్థానాన్ని కైవశం చేసుకునేందుకు డీఎంకే అభ్యర్థిగా మాజీ మేయర్ ఎం సుబ్రమణ్యం బరిలో దిగారు.
టీ నగర్:
అన్నాడీఎంకేకు చెందిన విపి కైళైరాజన్ ఇక్కడ వరుస విజయాలతో దూసుకొచ్చారు. అయితే, ఈ సారి ఆయనకు సీటు ఇవ్వలేదు. ఆ పార్టీ తరఫున సత్యనారాయణ అలియాస్ సత్య బరిలో దిగారు. అయితే, ఈ సారి ఇక్కడ బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా రేసులో ఉండడంతో ఈ నియోజకవర్గం కూడా వీఐపీ జాబితాలోకి చేరింది. ఇన్నాళ్లు ఈ సీటును కాంగ్రెస్‌కు దారాదత్తం చేస్తూ వచ్చిన డీఎంకే ఈ సారి తమ అభ్యర్థిగా కొత్త ముఖంగా మహిళా అభ్యర్థి కనిమొళిని పోటీకి దించారు.
మైలాపూర్:
దీనిని కూడా వీఐపీ నియోజకవర్గంగా పరిగణించక తప్పదు. మాజీ డీజీపీ నటరాజ్ అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీకి దిగారు. తొలి సారిగా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి ప్రజల మన్ననలు పొందేయత్నం చేస్తున్నారు. ఆయన్ను ఎదుర్కొనేందుకు డీఎంకే తరఫున కాంగ్రెస్ అభ్యర్థి రంగంలోకి దిగనున్నారు.
వేళచ్చేరి:
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ నియోజకవర్గాన్ని అన్నాడిఎంకే తన గుప్పెట్లోకి తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్‌కు సీటు నిరాకరించడంతో,అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎంిసీ మునుస్వామి రేసులో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా నటుడు వాగై చంద్రశేఖర్ పోటీకి దిగడంతో ఇది కూడా వీఐపీ జాబితాలోకి చేరింది.
కొళత్తూర్:
వీవీఐపీ జాబితాలో ఉన్న మరో నియోజకవర్గం. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ మళ్లీ తన హవాను చాటుకునేందుకు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడంతో ఈ సారి భారీ ఆధిక్యం లక్ష్యంగా డీఎంకే వర్గాలు స్టాలిన్ కోసం ఇంటింటా తిరుగుతున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా జేసీడీ ప్రభాకర్ రేసులో దిగారు. మిగిలిన పార్టీలూ ఇక్కడ అభ్యర్థులను దించినా ప్రధాన పోటీ మాత్రం స్టాలిన్, జేసీడీ ప్రభాకర్‌ల మధ్య నెలకొంది.