'మావోయిస్టు ఆర్కే.. మా దగ్గర లేరు'
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) తమ అదుపులో లేరని విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. ఈ విషయంలో ప్రజాసంఘాల ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. కేవలం ప్రచారం కోసమే వరవరరావు లాంటి వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. ఆర్కే సహా మావోయిస్టు నేతలు ఎవరూ తమ అదుపులో లేరని ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 30 మంది మరణించారని, వారిలో 16 మందిని మాత్రమే గుర్తించామని, మరో 14 మందిని ఇంకా గుర్తించలేదని అన్నారు.
బంధువులు ఎవరైనా వారిని గుర్తిస్తే వారికి అప్పగిస్తామని, లేనిపక్షంలో తామే ఖననం చేస్తామని వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇందుకు 72 గంటలు వేచి చూస్తామన్నారు. అలాగే.. మహిళా మావోయిస్టుల మీద అత్యాచారాలు జరిగాయన్నవి కూడా తప్పుడు కథనాలేనని ఆయన స్పష్టం చేశారు. పోస్టు మార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలతో చిత్రీకరించామని, ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదని రాహుల్ దేవ్ శర్మ చెప్పారు.