కరువు ప్రాంతాల్లో నీరందిచండి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సేన
- కృత్రిమ వర్షాలు కురిపించాలని సూచన
ముంబై: కరువు అధికంగా ఉన్న ప్రాంతాలకు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. కృత్రిమ వర్షాలు కురిసేందుకు రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన మేఘ మథనం ప్రాజెక్టుపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అలాగే గురువారం సేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది కూడా వర్షాలు సరిగ్గా కురవకపోతే రాష్ర్టంలో వరుసగా ఇది 4వ కరువు సంవత్సరమవుతుందని పేర్కొంది. మేఘమథనం ప్రాజెక్టుపై ఎటువంటి అభ్యంతరాలు లేవని, అయితే ఈ ప్రాజెక్టు వల్ల కచ్చితంగా ఎంత వర్షాపాతం నమోదవుతుందనే విషయం వెల్లడించాలని డిమాండ్ చేసింది.
కేవలం కృత్రిమ వర్షాలు కురిపించే అంశంపైనే కాకుండా కరువు పీడిత ప్రాంతాల్లో నీటి వసతులు ఏర్పాటు చేయడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది. ఆకాశంలో మేఘాలు కనుమరుగయ్యాయని ఇక వర్షం ఎక్కడ పడుతుందని వ్యాఖ్యానించింది. ఈ సమస్య నుంచి రైతులు, రాష్ట్రాన్ని కాపాడాలంటే కృత్రిమ వర్షాలతో పాటు నీరు అందుబాటులో ఉండేలా చేయడంపై తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ముంబై, కొంకణ్, విదర్భ ప్రాంతాల్లోనే రుతుపవనాలు కేంద్రీకృతమయ్యాయని, రాష్ట్రమంతటా విస్తరించలేదని పేర్కొంది.
రుతుపవనాల రాక కోసం ఎదురు చూస్తున్న రైతులు దీని వల్ల తీవ్రంగా ఇబ్బందిపడతారని చెప్పింది. రాష్ట్రంలో వర్షాకాలం మొదటి నెలలో 35-40 శాతం సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైందని వెల్లడించింది. గతనెలలో రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనానికి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించినట్లు పేర్కొంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. జూలై- ఆగస్టు నెలలో విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువ నమోదైతే ఆ ప్రాంతాల్లో మేఘమథనం చేపడతామన్నారు. ఇందుకోసం ఖడ్సే నేతృత్వంలో విపత్తు నిర్వహణ శాఖ టెండర్లకు ఆహ్వానించింది.