'ఐదేళ్లలో రూ.2.03 లక్షల కోట్లు ఇస్తాం' | We will give 2.03 lakh crore to Ap | Sakshi
Sakshi News home page

'ఐదేళ్లలో రూ.2.03 లక్షల కోట్లు ఇస్తాం'

Published Sat, Oct 29 2016 1:31 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

'ఐదేళ్లలో రూ.2.03 లక్షల కోట్లు ఇస్తాం' - Sakshi

'ఐదేళ్లలో రూ.2.03 లక్షల కోట్లు ఇస్తాం'

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

- ఎన్‌హెచ్‌లు, నౌకా, విమానాశ్రయాలు, పరిశ్రమలు త్వరలో మంజూరు
- ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తాం
- రాజధాని నిర్మాణంలో చంద్రబాబును ఒంటరిగా వదిలేయం
అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి చేయూతనిస్తుంది
- రాయపూడిలో పరిపాలనా నగరం,రహదారుల నిర్మాణానికి జైట్లీ శంకుస్థాపన
- ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటే తప్పేంటి?: చంద్రబాబు
- చరిత్రలో ఎవరూ ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చాం: వెంకయ్యనాయుడు
 
 సాక్షి, అమరావతి: రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ రూపాల్లో రూ.2.03 లక్షల కోట్ల నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైటీ ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2009 వరకూ 13 జిల్లాలకు రూ.34 వేల కోట్లు, 2009 నుంచి 2014 వరకూ రూ.69 వేల కోట్ల ఇచ్చిందని, తాము ఐదేళ్లలోనే అంతకు ఐదు రెట్ల నిధులు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడి సమీపంలో పరిపాలనా నగరం, రాజధాని రోడ్ గ్రిడ్‌లోని ఏడు రహదారుల నిర్మాణానికి అరుణ్ జైట్లీ మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. విజయవాడలో మురుగు నీటిపారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి అక్కడి నుంచే రిమోట్‌తో శంకుస్థాపన గావించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అరుణ్ జైట్లీ మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఉద్ఘాటించారు. ఇప్పటికే ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ వంటి డజన్ల కొద్దీ జాతీయ విద్యా సంస్థలను ఏపీకి మంజూరు చేశామని అన్నారు. జాతీయ రహదారులు, సెయిల్, ఓఎన్‌జీసీ విస్తరణతోపాటు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులను త్వరలో మంజూరు చేస్తామన్నారు. భూ సేకరణ పూర్తయిన వెంటనే విజయవాడ (గన్నవరం) విమానాశ్రయాన్ని అత్యాధునిక ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

 భూములిచ్చిన రైతులకు అభినందనలు
 ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలన్నింటినీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఏపీకి అందజేస్తామని అరుణ్ జైట్లీ అన్నారు. ఎక్స్‌టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టుల కింద నిధులిస్తామన్నారు. ఈ సహాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఏపీని త్వరలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తమకు మూలధన పన్నును మినహాయించాలని కోరారని, ఢిల్లీకి వెళ్లిన వెంటనే ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజధానిలో ఏడు రోడ్లు, ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే అమరావతి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఒంటరిగా వదిలేయబోమని, కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయూతనిస్తుందని పేర్కొన్నారు. దేశంలోనే ఆధునిక నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అభినందిస్తున్నట్లు చెప్పారు.

 ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు: చంద్రబాబు
 కేంద్రం సహకరిస్తానన్నప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటే తప్పేమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయన్న వాదనలో వాస్తవం లేదన్నారు. కావాలనే కొందరు దీనిపై ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక కారణాల వల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్ర ప్రభుత్వం దానివల్ల వచ్చే ప్రయోజనాలన్నింటితో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని పేర్కొన్నారు. హోదాతో వచ్చే వాటన్నింటినీ తూచ తప్పకుండా, ఒక్క పైసా కూడా తగ్గకుండా ఇస్తామన్నారని, అందుకే తాను దానికి అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

ఈఏపీ ప్రాజెక్టులకు 90 శాతం నిధులిస్తామంటున్నారని, మనం ఖర్చు పెడితే ఆ డబ్బు ఇస్తారని తెలిపారు. లోటు బడ్జెట్‌ను పూడ్చాలని రూ.17 వేల కోట్లు అడిగామని, రూ.4 వేల కోట్లు ఇచ్చారని చెప్పారు. విజయవాడ, గుంటూరుకు రూ.వెయ్యి కోట్లిచ్చారని, రాజధానికి రూ.1,500 కోట్లిచ్చారని వివరించారు. అరుణ్ జైట్లీతో జరిగిన సమావేశంలోనూ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి అడిగానని గుర్తుచేశారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్‌ను మినహాయించాలని కోరానన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయం చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. విశాఖలో రైల్వే జోన్ త్వరలో వస్తుందనే నమ్మకం తనకుందన్నారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులు, కడపలో స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నంలో పోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇక్కడ పెద్ద సెంటిమెంట్‌గా మారిందని వ్యాఖ్యానించారు. శంకుస్థాపన చేసిన నాలుగు ప్రాజెక్టులు పూర్తయితే రాజధానికి ఒక రూపు వస్తుందన్నారు. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ సహాయపడడం వల్ల కొంతవరకూ నిలదొక్కుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిజం కావడానికి జైట్లీ కారణమని చంద్రబాబు ప్రశంసించారు.  

 చెప్పనివి కూడా చేస్తాం: వెంకయ్య
 విభజన చట్టంలో చెప్పినవే కాకుండా, చెప్పని వాటిని కూడా ఏపీ కోసం చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. చరిత్రలో ఎవరూ ఇవ్వని రీతిలో, ఇవ్వనన్ని నిధులు, ప్రాజెక్టులను కేంద్రం ఏపీకి ఇచ్చిందన్నారు. అమరావతి గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాజధానిలో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మిస్తామని, గుంటూరుకు ఎలక్ట్రికల్ రైలు ఇస్తామన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు తాను రాజ్యసభలో మాట్లాడానని, అప్పుడు నోరు పెగలని నేతలు ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు.

తాను ఎన్నికల్లో నిలబడనని, తన పిల్లలు ఎన్నికల్లో పోటీ చేయరని, అందుకే ఉన్న విషయాలు చెబుతున్నానని అన్నారు. సభలో జైట్లీ ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలుగులోకి అనువదించారు. తొలుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోకగజపతిరాజు, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధార్ధనాథ్‌సింగ్, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement