రోగుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఉపయుక్తం
నగరవ్యాప్తంగా 28 కమిటీలు
ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నేతృత్వంలో నిర్వహణ
ప్రభుత్వ సేవలు అందరికీ చేరే అవకాశం
ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్
న్యూఢిల్లీ : నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలు రోగుల ఆరోగ్య, మెడికల్ సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని 28 ప్రభుత్వ ఆస్పత్రులకు 28 కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీలు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే నేతృత్వంలో పనిచేస్తాయని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేకు ఆస్పత్రిలోనే ఓ గది కేటాయించనున్నారు. రోగుల ఫిర్యాదులను అతని నేతృత్వంలోని కమిటీ పరిష్కరించాల్సి ఉంటుంది.
ఈ విధంగా కొంత మందిని భాగస్వాములను చేస్తూ కమిటీలు నియమించడం వల్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అందించే సేవలు అందరికీ చేరే అవకాశం ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా కింది స్థాయిలో నెలకొన్న సమస్యలు త్వరగా పరిష్కరించొచ్చని చెప్పారు. మెడిసిన్ కొరత, ఆస్పత్రుల్లో పరిశుభ్రత, వైద్య సేవలకు సంబంధించిన సమస్యలపై అప్పటికప్పుడే ఈ కమిటీలు నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించామని వెల్లడించారు. అంతే కాకుండా ఆస్పత్రుల్లో డిస్పెన్సరీ, ప్రభుత్వ పథకాలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో గమనించేందుకు 10 జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కమిటీలు కూడా ఎమ్మెల్యే నేతృత్వంలో పని చేస్తాయన్నారు. అంతేకాకుండా నులిపురుగులతో బాధపడుతున్న 1 నుంచి 19 ఏళ్ల పిల్లలు 35 లక్షల మందికి మందులు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాం. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సందర్శించి వారికి తగిన మందులు అందజేయడంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. విపరీతంగా జంక్‌ఫుడ్ తినడం వల్ల వారు ఈ సమస్యతో బాధ పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. అంతేకాకుండా సమయానుసారం ఆహారం తీసుకోకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అందుకే నులిపురుగుల అవగాహన కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.
పిల్లలకి కవచంలా ఇంద్ర ధనుష్
ఏప్రిల్ 7 నుంచి 14 వరకు నిర్వహించిన ఇంద్ర ధనుష్ కవచ్ మొదటి దశలో 1,116,13 మంది విద్యార్థులకు, 13,222 మంది గర్భిణిలకు టీకాలు వేశామన్నారు. 14,198 ఓఆర్‌ఎస్, 26,073 జింక్ ట్యాబ్లెట్లు, 60,887 విటమన్-ఏ ట్యాబ్లెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నగర వ్యాప్తంగా నిర్వహించామని చెప్పారు. రానున్న కాలంలో కూడా ఇంకా మెరుగ్గా ఈ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ప్రస్తుతం 700-800 కేంద్రాలు ఏర్పాటు చేశామని, రానున్న కాలంలో 1000కి పెంచాలనుకుంటున్నట్లు వెల్లడించారు. నగరంలోని పిల్లలందరికీ టీకాలు వేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సంక్షేమ కమిటీలు
Published Thu, Apr 16 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM
Advertisement