ఆసుపత్రులకు రంగుల దుప్పట్లు
- తెలుపు, గులాబీ, నీలి ఆకాశం,నీలి రంగులు ఖరారు
- నెల రోజుల్లో సరఫరా...టెండర్లు వేసిన ఏడు కంపెనీలు
- లక్ష దుప్పట్ల కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో నెల రోజుల్లో నాలుగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం టెండర్లు పిలవగా ఏడు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. వాటిని వారం రోజుల్లో ఖరారు చేసి నెల రోజుల్లో ఆసుపత్రులకు రంగుల దుప్పట్లను సరఫరా చేయనున్నారు. మొదట ఏడు రోజులకు ఏడు రంగుల దుప్పట్లు అనుకున్నారు. ఆ తర్వాత రెండు రంగుల దుప్పట్లపై కసరత్తు జరిగింది. చివరకు నాలుగు రంగులతో నాలుగు రకాల దుప్పట్లను ఖరారు చేశారు. తెలుపు, గులాబీ, నీలి ఆకాశం, నీలి రంగులను ఖరారు చేశారు. లక్ష దుప్పట్లలో 40 వేలు తెలుపు, 40 వేలు గులాబీ, 10 వేలు నీలి ఆకాశం, మరో 10 వేలు నీలి రంగులను ఆసుపత్రులకు సరఫరా చేస్తారు.
తెలుపు, గులాబీ రంగు దుప్పట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సాధారణ పడకలపై రోజు విడిచి రోజు మార్చుతారు. ఇక నీలి ఆకాశం, నీలి దుప్పట్లను ఐసీయూలు, డాక్టర్లు, నర్సుల ప్రత్యేక గదుల్లో వాడాలని నిర్ణయించామని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ వేణుగోపాల్ ‘సాక్షి’కి తెలిపారు. కొత్త దుప్పట్ల కోసం రూ.3 కోట్లు కేటాయించామన్నారు. ఒక్కో దుప్పటికి రూ.300 నుంచి రూ.350 వరకు ఖర్చు కాగలదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న తెల్ల దుప్పట్లు పెద్ద నాణ్యమైనవి కావన్నారు. అవి ఆరేడు నెలలకు మించి మన్నిక ఉండబోవన్నారు. వాటిని రూ.180 చొప్పున కొనుగోలు చేసేవారమన్నారు. కొత్తగా కొనుగోలు చేసే దుప్పట్లను నాణ్యమైనవాటినే కంపెనీల నుంచి తీసుకుంటామని... వాటి మన్నిక కనీసం రెండేళ్లు ఉంటుందని అన్నారు. తమ ప్రమాణాల మేరకు సరఫరా చేసే కంపెనీలకే టెండర్ ఖరారు చేస్తామని వేణుగోపాల్ తెలిపారు.
20 వేల పడకలపై కొత్త దుప్పట్లు...
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక రోగి వాడిన దుప్పటిని మరో రోగి వాడుతున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులు అంటు వ్యాధులకు గురవుతున్నారు. పడకలు అపరిశుభ్రానికి ఆనవాళ్లుగా మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా రంగు రంగుల దుప్పట్లను వాడుతున్నారు. రోజు విడిచి రోజు దుప్పట్లు మార్చడం వల్ల వాడిన దుప్పట్లను తప్పనిసరిగా ఉతికి ఆరేస్తారనేదే సర్కారు ఉద్దేశం. దీనివల్ల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ రోజు ఏ రంగు దుప్పటి వాడాలో నిర్ణయిస్తారు.
ఆ ప్రకారమే ఆసుపత్రి సిబ్బంది దుప్పట్లను మార్చుతూ... మార్చిన వాటిని ఉతికేయించి మరో రోజుకు సిద్ధంగా ఉంచుతారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయిలో ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే సహా అనేక పెద్దాసుపత్రులున్నాయి. అలాగే బోధనాసుపత్రులూ ఉన్నాయి. వాటన్నింటిలో దాదాపు 20 వేల వరకు పడకలున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్, సరోజినీ దేవి వంటి పెద్దాసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏకంగా 8,374 పడకలున్నాయి. వాటిల్లోనూ రెండు రంగుల బెడ్‌షీట్లు రానున్నాయి.