తగ్గుతున్న పిల్లల దత్తత!
♦ శిశువుల అక్రమ అమ్మకాలే ప్రధాన కారణం
♦ రోజు రోజుకు పెరుగుతున్న దరఖాస్తులు
♦ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద 12 వేల అప్లికేషన్స్
సాక్షి, హైదరాబాద్: అనాథ పిల్లల్ని కేంద్రానికి అప్పగించే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం దగ్గరికి చేరే అనాథపిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా 2010లో కేంద్రం అన్ని రాష్ట్రాల్లో దాదాపు 6,321 మంది అనాథపిల్లలను దత్తతకు ఇచ్చింది. గతేడాది ఆ సంఖ్య 4,362కు పడిపోయింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 1,720 మంది పిల్లలను మాత్రమే దత్తతకు ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రులు, నిర్మానుష్య ప్రదేశాల్లో శిశువులను వదిలిపోతున్న సంఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే శిశువుల అక్రమ అమ్మకాల వల్లే ప్రభుత్వానికి చేరే అనాథపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో ఇదీ పరిస్థితి..
ప్రస్తుతం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 235 మంది అనాథ పిల్లలున్నారు. మన రాష్ట్రం నుంచి దత్తత తీసుకునేందుకు 888 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది 225 మంది పిల్లలను దత్తతకు ఇచ్చారు. ఈ సంఖ్య గతంతో పోలిస్తే కాస్త పెరిగింది. అయితే శిశు గృహాలకు చేరే శిశువుల సంఖ్య మాత్రం తగ్గుతోందని అధికారులు వాపోతున్నారు. కాగా, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా)కు అన్ని రాష్ట్రాల నుంచి 12 వేలకు పైగా దత్తత దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తులకు తగ్గట్లు శిశు గృహాల్లో అనాథ పిల్లలు లేరు. పిల్లలు ఏ శిశు గృహంలో అందుబాటులో ఉన్నా దేశవ్యాప్తంగా ఎవరైనా ఆన్‌లైన్‌లో కానీ నేరుగా కానీ దరఖాస్తు చేసుకునేలా ఈ ఏడాది ఆగస్టులో అవకాశం కల్పించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.