దళిత కుటుంబాల వెలిపై మంత్రి ఆరా | Whether the exclusion of the working class | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబాల వెలిపై మంత్రి ఆరా

Published Mon, Jan 27 2014 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

Whether the exclusion of the working class

  • కగ్గనహళ్లిలో ఘటన
  • సరుకులు ఇవ్వరాదని దండోరా
  • గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ డీకే రవి
  • గ్రామంలో ఉండలేక పోతున్నామని దళితుల ఆవేదన  
  •  
    కోలారు, న్యూస్‌లైన్ : ముళబాగిలు తాలూకా కగ్గనహళ్లి గ్రామంలో దళిత కుటుంబాలను అగ్రవర్ణాలు వెలివేయడంపై జిల్లాలో సంచలనం  సృష్టించింది. ఈ సంఘటనపై మంత్రి యూటీ ఖాదర్ ఆరా తీశారు. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ డీకే రవి హుటాహుటిన గ్రామాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌సీకి కేటాయించిన వంటమనిషి పోస్టును ఇతర కులాలకు కేటాయించడంతో పాటు కొళాయిల్లో నీరు పట్టుకునే విషయంపై కూడా దళితులు, అగ్రవర్ణాల మధ్య బేధాబిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. దీంతో గ్రామంలో 16 కుటుంబాలు ఉండగా నాలుగు కుటుంబాలను వెలివేశారు.

    ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌కు బాధితులు మునిస్వామి, మునివెంకటప్ప, పాపణ్ణ, క్రిష్ణప్ప తమ గోడు వెల్లబోసుకున్నారు. దుకాణాలలో సరుకులు కూడా ఇవ్వకుండా అగ్రవర్ణాలు నాలుగు రోజుల క్రితం హుకుం జారీ చేస్తూ దండోరా వేయించారని వాపోయారు. ఎవరికైనా సరుకులు ఇస్తే రూ.500  జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారని గ్రామ పంచాయతీ సభ్యుడు కూడా అయిన మునిస్వామి ఆరోపించారు. తాను గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉండి కూడా ఏమి చేయలేక పోయానని, ఆత్మహత్య చేసుకోవాలనేంత మానసిక వేదనకు గురయ్యానని  కన్నీరుమున్నీరయ్యారు.

    రాధమ్మ అనే మహిళ మాట్లాడుతూ... గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్సీ సముదాయానికి రిజర్వు చేసిన  వంట మనిషి ఉద్యోగానికి తాను దరఖాస్తు చేసుకున్నా ఇతర వర్గాల వారికి కట్టబెట్టారని వాపోయింది. ఇందుకు కారణం ఎస్‌డీఎంసీ అధ్యక్షుడు సురేష్‌బాబు కారణమని ఆరోపించింది. ఇదిలా ఉండగా తాము ఎవరినీ బహిష్కరించలేదని, వ్యక్తిగత కక్షలతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి కలెక్టర్‌కు తెలిపారు. తాము దళితుల భూములపై బ్యాంకులలో రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని,  విచారణలో అది రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు.

    అకారణంగా తమపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు.  ఇదిలా ఉండగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ ఆదేశాల మేరకు రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ నిర్ధేశనాలయ అధికారుల బృందం ఉదయం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఎస్పీ రాంనివాస్ సెపాట్, సీఈఓ వినోత్‌ప్రియ, ముళబాగిలు తహశీల్దార్ సోమశేఖర్ , ముళబాగిలు డీఎస్పీ సిద్దప్ప తదితరులు ఉన్నారు.
     
    ఆ నియామకాన్ని రద్దు చేయండి
     
    వంటమనిషి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసి ఎస్సీ మహిళతో ఆ పోస్టు భర్తీ చేయాలని  పీడీఓ బాబు శేషాద్రిని కలెక్టర్ ఆదేశించారు. దళిత కాలనీలకు నీటిని సక్రమంగా సరఫరా చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌కు పంప్‌సెట్ అమర్చాలని ఆదేశించారు. సాధ్యమైనంత వరకు అందరూ కలిసి వెళ్లాలని కలెక్టర్ నచ్చచెప్పారు. గ్రామ బహిష్కరణ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పాత్రికేయులకు తెలిపారు.  
     
    దోషులని తేలితే  ఎంతటివారినైనా వదిలేది లేదు : ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్
    కగ్గనహళ్లి గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణ విషయంలో దోషులని తేలితే ఎంతటివారినైనా వదిలేది లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఘటనపై  విచారణ జరిపించేందుకు తహశీల్దార్ తదితర అధికార  బృందాన్ని గ్రామానికి పంపాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement