గౌరీ లంకేష్‌ను ఎవరు చంపారు? | who killed Gauri Lankesh | Sakshi
Sakshi News home page

గౌరీ లంకేష్‌ను ఎవరు చంపారు?

Published Mon, Sep 11 2017 4:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

గౌరీ లంకేష్‌ను ఎవరు చంపారు? - Sakshi

గౌరీ లంకేష్‌ను ఎవరు చంపారు?

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లా, ధూప్‌గిరి గ్రామంలోని ధర్మాస్పత్రి అది. దాని ఆవరణలోని దిక్కులేని రెండు మృతదేహాలను చూస్తుంటే ఎవరికైనా మనసు వికలం అవుతుంది. అందుకనే పత్రికలుగానీ, టీవీలుగానీ యథాతధంగా వాటిని చూపించేందుకు ఇష్టపడవు. ఆ మృతదేహాలు బక్కచిక్కిన ఇద్దరు 19 ఏళ్ల యువకులవి. వారి మరణం అంతకన్నా దారుణంగా ఉన్నప్పుడు వారి మృతదేహాలను చూపించడంలో తప్పేమిటీ?
 
అన్వర్‌ హుస్సేన్, నజ్రుల్‌ షేక్‌లు ఆగస్టు 27వ తేదీన ధూప్‌గిరి గ్రామం నుంచి పశువులను తోలుకుంటూ వెళుతుండగా గోరక్షకుల పేరిట కొంత మంది యువకులు వారిని అడ్డగించారు. సురక్షితంగా పశువులను తీసుకెళ్లేందుకు 50 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. తాము కడు పేదవాళ్లమని, తమ వద్ద ఏ మాత్రం డబ్బుల్లేవని చెప్పడంతో వారిని చెట్టకు కట్టేసి రాళ్లతో కొట్టి గోరక్షకులు హత్య చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను తీసుకొచ్చి ఆస్పత్రి ఆవరణలో పడేశారు. 
 ఆ మరుసటి రోజు ఈ వార్త యథాతధంగా జాతీయ మీడియాలో వచ్చింది. దీన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ తీవ్రంగా ఖండించారు. గో సంరక్షణ పేరిట దేశంలో పెరిగిపోతున్న హత్యలను తీవ్రంగా విమర్శించారు. హుస్సేన్, నజ్రుల్‌ హత్య జరిగిన పది రోజుల్లోనే అంటే, సెప్టెంబర్‌ ఐదవ తేదీన గౌరీ లంకేష్‌ను గుర్తుతెలియని వ్యక్తి ఎవరో కాల్చి చంపారు. ఆమెను గోరక్షకులు లేదా హిందూత్వ వాదులు హత్య చేసి ఉంటారని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత, ఆమె అడవిదారి పట్టిన నక్సలైట్లను జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేసినందున ఆమెను నక్సలైట్లు హత్యచేసి ఉంటారని ప్రచారం మొదలయింది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన గౌరీ లంకేష్‌ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందంను నియమించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అసలైన దోషులను పట్టుకుంటామని ప్రకటించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం కొన్ని క్లూలను సేకరించిందని, త్వరలోనే కేసును ఛేదిస్తుందని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఇంతకు గౌరీని ఎవరు చంపారన్న విషయమై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement