Gauri Lankesh Patrike
-
గౌరీ లంకేష్‌ను ఎవరు చంపారు?
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లా, ధూప్‌గిరి గ్రామంలోని ధర్మాస్పత్రి అది. దాని ఆవరణలోని దిక్కులేని రెండు మృతదేహాలను చూస్తుంటే ఎవరికైనా మనసు వికలం అవుతుంది. అందుకనే పత్రికలుగానీ, టీవీలుగానీ యథాతధంగా వాటిని చూపించేందుకు ఇష్టపడవు. ఆ మృతదేహాలు బక్కచిక్కిన ఇద్దరు 19 ఏళ్ల యువకులవి. వారి మరణం అంతకన్నా దారుణంగా ఉన్నప్పుడు వారి మృతదేహాలను చూపించడంలో తప్పేమిటీ? అన్వర్ హుస్సేన్, నజ్రుల్ షేక్‌లు ఆగస్టు 27వ తేదీన ధూప్‌గిరి గ్రామం నుంచి పశువులను తోలుకుంటూ వెళుతుండగా గోరక్షకుల పేరిట కొంత మంది యువకులు వారిని అడ్డగించారు. సురక్షితంగా పశువులను తీసుకెళ్లేందుకు 50 వేల రూపాయలను చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. తాము కడు పేదవాళ్లమని, తమ వద్ద ఏ మాత్రం డబ్బుల్లేవని చెప్పడంతో వారిని చెట్టకు కట్టేసి రాళ్లతో కొట్టి గోరక్షకులు హత్య చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాలను తీసుకొచ్చి ఆస్పత్రి ఆవరణలో పడేశారు. ఆ మరుసటి రోజు ఈ వార్త యథాతధంగా జాతీయ మీడియాలో వచ్చింది. దీన్ని సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ తీవ్రంగా ఖండించారు. గో సంరక్షణ పేరిట దేశంలో పెరిగిపోతున్న హత్యలను తీవ్రంగా విమర్శించారు. హుస్సేన్, నజ్రుల్ హత్య జరిగిన పది రోజుల్లోనే అంటే, సెప్టెంబర్ ఐదవ తేదీన గౌరీ లంకేష్‌ను గుర్తుతెలియని వ్యక్తి ఎవరో కాల్చి చంపారు. ఆమెను గోరక్షకులు లేదా హిందూత్వ వాదులు హత్య చేసి ఉంటారని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత, ఆమె అడవిదారి పట్టిన నక్సలైట్లను జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేసినందున ఆమెను నక్సలైట్లు హత్యచేసి ఉంటారని ప్రచారం మొదలయింది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన గౌరీ లంకేష్ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందంను నియమించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అసలైన దోషులను పట్టుకుంటామని ప్రకటించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం కొన్ని క్లూలను సేకరించిందని, త్వరలోనే కేసును ఛేదిస్తుందని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఇంతకు గౌరీని ఎవరు చంపారన్న విషయమై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. -
గౌరీ లంకేశ్ వారసులు ఎవరు?
సాక్షి, బెంగళూర్: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యానంతరం మొదలైన రాజకీయ దుమారం ఓవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు టాబ్లాయిడ్ ఈ వారం ఎడిషన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో పేపర్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రముఖ టాబ్లాయిడ్ 'గౌరీ లంకేశ్ పత్రికె' కొనసాగుతుందా? లేక మూతపడుతుందా?.. కొనసాగిస్తే తర్వాతి పగ్గాలు(ఎడిటర్‌గా బాధ్యతలు) చేపట్టేది ఎవరు? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. శుక్రవారం బసనవగుడిలోని పత్రిక ప్రధాన కార్యాలయంలో టాబ్లాయిడ్ ఎడిటోరియల్ సభ్యులు సమావేశమై ఈ అంశం పైనే చర్చించినట్లు సమాచారం. అయితే తాము కేవలం సెప్టెంబర్ 12న మేడమ్(గౌరీ లంకేశ్) కోసం ‘నాను గౌరీ(నేను గౌరీ)’ పేరిట నిర్వహించబోయే స్మారక సభ ఏర్పాట్ల గురించి చర్చించామని సభ్యులు పైకి చెబుతున్నారు. ‘ప్రస్తుతం ఏడుగురు ఉద్యోగులు ఈ వీక్లీ పేపర్లో పని చేస్తున్నారని, వీరిలో ఇద్దరు పార్ట్ టైమ్ ఉద్యోగులు. మేడమ్ కుటుంబ సభ్యులతో కూర్చుని సంప్రదింపులు చేశాకే పేపర్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకుంటామని.. కానీ, అది ఇప్పుడే జరగకపోవచ్చు‘ అని గిరీశ్ తలికట్టే వెల్లడించారు. గౌరీ నిర్వహించిన ఉద్యోగ అనే సంచికకు గిరీశ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ‘గౌరీ కటుంబ సభ్యులు షాక్‌లో ఉన్నారు. వారు తేరుకోవటానికి మరికొంత సమయం పడుతుంది. పత్రిక కొనసాగాలని సన్నిహితులు కోరుకుంటున్నారు. కానీ, అందుకు మరికొంత సమయం పట్టవచ్చు’ అని సతీష్ అనే మరో ఉద్యోగి తెలిపారు. 2005లో గౌరీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చాక సతీశ్ గౌరీ వెంట నిలిచారు. ఇక పబ్లికేషన్ కాలమ్నిస్ట్, 1980 నుంచి గౌరీ ఫ్యామిలీతో మంచి సంబంధాలున్న చంద్రే గౌడ మాత్రం టాబ్లాయిడ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణానికి పత్రికె కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కాబట్టి వారు ఇక దాన్ని కొనసాగించే అవకాశాలు చాలా తక్కువ అని ఆయన చెబుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు టాబ్లాయిడ్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సమయంలోనే పత్రికె కొనసాగుతుందా? అని తనకు అనిపించేదని గౌడ తెలిపారు. అయితే ఏది ఏమైనా హిందుత్వ సంఘాలకు సింహ స్వప్నంగా మారిన లంకేశ్ పత్రికె కొనసాగితీరుతుందని గౌరీ లంకేశ్ సన్నిహితులు శివ సుందర్ చెబుతున్నారు. వారి (హిందుత్వ సంఘాలు) ఆగడాలకు వ్యతిరేకంగా కథనాలు రాసినందుకే ఆమెకు హెచ్చరికలు పంపారు. ఈ క్రమంలోనే గౌరీని హత్య కూడా చేశారంటూ సుందర్ ఆరోపించారు.