మహిళా కలెక్టర్‌పై చిందులు
► సీఎం ఆప్తుడు మరిగౌడపై చార్జ్‌షీట్ దాఖలు
► ఆరోపణలు నిజమేనని నిర్ధరణ
మైసూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, మాజీ జిల్లా పంచాయతీ అధ్యక్షుడు కె.మరిగౌడకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు. మైసూరు జిల్లా కలెక్టర్‌గా సి.శిఖా ఉన్న సమయంలో ఆమెను మరిగౌడ ఏకవచనంలో దూషించడంతో పాటు విధులకు అడ్డుపడినట్లు, బెదిరించినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఊపందుకుంది. పోలీసు విచారణలో ఆరోపణలు తేలడంతో మైసూరు నజరాబాద్ పోలీసులు మరిగౌడపైన 45 పేజీల చార్జిషీట్‌ను రూపొందించి మైసూరు కోర్టులో గురువారం సమర్పించారు.
తహసిల్దార్ బదిలీపై కలెక్టర్‌తో గొడవ
2016 జులై 3వ తేదీన సీఎం సిద్ధరామయ్య మైసూరు గెస్ట్‌హౌస్‌లో బసచేసిన సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఉన్న సీ.శిఖా వచ్చి సీఎంను స్వాగతించారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సీఎంకు సన్నిహితుడైన మరిగౌడ మైసూరు జిల్లా నుంచి యాదగిరికి తహసిల్దార్ నవీన్ జోసెఫ్‌ను ఎందుకు బదిలీ చేశారని కలెక్టర్ శిఖాను ప్రశ్నించారు.
అక్కడ చాలామంది అధికారులు ఉండగానే ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమెను ఏకవచనంతో నిలదీశారు. ఈ ఘటన పైన కలెక్టర్ శిఖా నజరాబాద్ పోలీసులకు కే.మరిగౌడతో పాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలోనున్న మరిగౌడ ముందస్తు బెయిలు కోసం తీవ్రంగా యత్నించారు.
నెలరోజుల తరువాత మరిగౌడ నజరాబాద్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోవడంతో పాటు నెల రోజుల పాటు కస్టడీపై జైల్లో గడిపారు. తరువాత బెయిల్ దక్కింది. పోలీసులు విచారణ జరిపి మరిగౌడ, మైసూరు తాలూకా కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు మంజునాథ్, బసవరాజులపై విధులకు అడ్డుపడడం, బెదిరింపు, దూషించడం తదితర సెక్షన్లతో అభియోగాలు మోపారు. మరో ఇద్దరు నిందితులు ఆనంద్, సిద్దరాజులు ఇంకా పరారీలో ఉన్నారు.