దక్షిణాది రాష్ట్రాలవారి పండుగలకు ప్రాధాన్యమిస్తాం
Published Sat, Nov 23 2013 11:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో దక్షిణాది రాష్ట్రాలవారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారి పండుగలైన సంక్రాంతి, దసరా, ఓనం, పొంగల్‌ను అధికారికంగా నిర్వహిస్తామని ఢిల్లీ విధానసభ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ఇకపై దక్షణాది రాష్ట్రాలకు చెందిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని శనివారం తన నివాసంలో దక్షిణ భారతదేశ మీడియా ప్రతినిధులతో నిర్వహించి సమావేశంలో పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులకు వరుస హామీలివ్వడం గమనార్హం. సంక్రాంతి, దసరా, ఓనం,పొంగల్ పండుగలను ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి వీటిలో పాల్గొనేలా స్థానికులను ప్రోత్సహిస్తామన్నారు.
ఢిల్లీలో చాలా రాష్ట్రాల ప్రజలున్నారు:
ఢిల్లీ దేశరాజధాని కావడంతో ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు అధికసంఖ్యలో నిర్వహిస్తున్నారని పార్టీ సీట్ల కేటాయింపుల్లో కాస్త ఇబ్బందులు తలెత్తడం సహజమేనన్నారు. ఎంసీడీ ఎన్నికల్లోనూ దక్షిణాదికి చెందిన వారికి నాలుగు కౌన్సిలర్ సీట్లు కేటాయించామని గడ్కరీ తెలిపారు. వారిలో ఒకరు గెలుపొందారని పార్టీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ అన్నారు. మున్ముందు మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాలవారు నివసించే ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరం చేయనున్నట్టు పేర్కొన్నారు.
గెలుపుమాదే:
పార్టీ టిక్కెట్ల కేటాయింపులో అత్యధికంగా పార్టీ శ్రేణులు కోరుకునేవారికే టిక్కెట్లు ఇచ్చామని గడ్కరీ పేర్కొన్నారు. పార్టీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో ఢిల్లీలో తమపార్టీ గెలుపు ఖాయమన్నారు. స్థానిక సమస్యలను సైతం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామన్నాని తెలిపారు. మేనిఫెస్టోలో సమస్యల ప్రస్తావనతోపాటు వాటి పరిష్కారానికి తీసుకోను న్న చర్యలను ప్రస్తావిస్తున్నట్టు గడ్కరీ వివరించారు.
ఆమ్‌ఆద్మీ పార్టీని సీరియస్‌గా తీసుకోం:
ఆమ్‌ఆద్మీ పార్టీని తాము ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్‌కి బీపార్టీ వంటిదని గడ్కరీ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నాయకత్వం వహిస్తుండగా, ఆమె కుమారుడు ఎంపీ సందీప్‌దీక్షిత్ ఆమ్‌ఆద్మీ పార్టీని వెనక నుంచి నడిపిస్తున్నారన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీగా చెప్పుకుంటున్నా, ఆ పార్టీ నుంచి పోటీపడే అభ్యర్థులంతా కోటీశ్వరులే అన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్,బీజేపీ మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు.
హరిత రాజధాని చేస్తాం:
ఢిల్లీ నగరాన్ని (హరిత రాజధాని) గ్రీన్‌క్యాపిటల్‌గా మారుస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. యమునా నీటిని శుద్ధిచేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనలో విసిగిపోయిన ఢిల్లీవాసులంతా బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ మురళీధర్‌రావు, రఘు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement