
బెంగళూరులో రెచ్చిపోయిన పోకిరీలు
బనశంకరి (బెంగళూరు): ఐటీ సిటీ బెంగళూరులో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు వేధింపులకు దిగుతున్నారు. తాజాగా రోడ్డుపై క్యాబ్ కోసం వేచిచూస్తున్న యువతిపై ముగ్గురు దుండగులు కీచకపర్వానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని హలసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎంజీ రోడ్డులోని హోటల్‌లో ఓ యువతి పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ కోసం వేచి చూస్తోంది.
ఈ సమయంలో బైకులో వచ్చిన ముగ్గురు దుండగులు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు లాగేయడానికి ప్రయత్నించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమె బ్యాగ్‌లో ఉన్న ఐఫోన్‌ను లాక్కుని ఉడాయించారు. రోదిస్తున్న యువతిని గమనించిన ఉబర్ క్యాబ్ డ్రైవర్లు బాధితురాలిని సమీప హలసూరు పీఎస్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
కారును అడ్డుకుని మహిళపై దాడి
మరో ఘటనలో పట్టపగలే నడిరోడ్డుపై కొందరు పోకిరీలు ఒక మహిళ దుస్తులు లాగి వేధించారు. బెంగళూరు కుమారస్వామి లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 19 తేదీ మధ్యాహ్నం ఒక మహిళ కారులో వెళ్తుండగా, కొందరు యువకులు ఆమె కారును అడ్డుకున్నారు. ఆమె కారు దిగుతుండగానే దుస్తులు లాగి కారును ధ్వంసం చేసి సెల్‌ఫోన్‌ను లాక్కుని పరారయ్యారు.