యువతితో బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన
బెంగళూరు : టికెట్ ఖరీదు పోనూ మిగతా చిల్లర ఇవ్వాలని అడిగిన యువతి పట్ల బెంగళూరు మెట్రో ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని చెబుతూ లైంగిక వేధింపులకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వివరాలను ఫేస్‌బుక్‌లో ఉంచింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ కేసులో ఇలాగే జరిగిందంటూ ఆ పోస్ట్‌లో ఉదహరించింది.
అయితే ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పాటు బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరగటంతో ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్‌ను తొలగించింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్‌జోన్ డీసీపీ డాక్టర్ శరణప్ప నిన్న మీడియాకు వెల్లడించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి జనవరి 10న రాత్రి 8.30 గంటల సమయంలో విధులు ముగించుకొని రాగిగుడ్డ బస్టాప్ నుంచి ఉత్తరహళ్లికి వెళ్లే బస్సు ఎక్కింది.
బస్సు బనశంకరి బస్టాండుకు చేరుకోగానే చాలా మంది దిగేశారు. దీంతో తనకివ్వాల్సిన చిల్లర ఇస్తే దిగిపోతానని చెప్పింది. ఈ సందర్భంలో కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన యువతి బస్సు ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్ కూడా పట్టించుకోలేదు. తనకు లవ్ లెటర్ ఇస్తే చిల్లర ఇస్తానని కండక్టర్ వేధించాడు. వెనుక సీట్లలో కూర్చున్న నలుగురు యువకులు ముందుకొచ్చి యువతికి అండగా నిలబడటంతో కండక్టర్ వెనక్కి తగ్గి మిగతా చిల్లర ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ యువతి చేతులు తాకి అసభ్యంగా వ్యవహరించాడు.
బస్సు దిగాక సదరు యువతి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు కండక్టర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా బస్సులో యువతిపై వేధింపులకు పాల్పడలేదని డ్రైవర్, కండక్టర్ తెలిపారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు బీఎంటీసీ ఎండీ అందుబాటులో లేదు.