దంపతుల మధ్య కోతి చిచ్చు..
దుగ్గొండి : కోతి తన చేష్టలతో ఇల్లంతా చిందర వందర చేసింది. అది కాస్తా భార్యాభర్తలిద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. భర్త దూషించడంతో కలత చెందిన భార్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. నాలుగు రోజుల పాటు ఎంజీఎంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన కందకట్ల మనోహర(40), శ్రీనివాస్ దంపతులు గ్రామంలో సైకిల్‌స్టాండ్‌తో పాటు కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు కోతి ఇంట్లోకి దూరి చాక్లెట్ డబ్బాలు ఎత్తుకెళ్లింది.
దీంతో కోతి వచ్చే వరకు ఎందుకు చూడలేదని భార్య మనోహరను శ్రీనివాస్ మందలించి తీవ్రంగా తిట్టాడు. దీంతో గొడవ పెద్దదిగా మారింది. భర్త దూషించడంతో అవమాన భారాన్ని తట్టుకోలేక మనోహర ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకుంది. చికిత్స నిమిత్తం ఎంజీఎం అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. ఇదిలా ఉండగా మనోహరతో శ్రీనివాస్ నిత్యం గొడవ పెట్టుకునే వాడని మనోహర పుట్టింటి వారు అంటున్నారు. అవమానకర మాటలను తట్టుకోలేకే తమ బిడ్డ చనిపోయిందని బాధితురాలి తల్లి వరలక్ష్మీ ఆరోపించారు. వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డి తెలిపారు.