‘రోడ్డుమీదకు వెళ్లాలంటేనే భయమేస్తోంది’
సాక్షి, బెంగళూరు: పాశ్చాత్య దుస్తులు వేసుకుంటే దాడులు చేస్తారా?, ఆ హక్కు ఎవరు ఇచ్చారు?, చీరకట్టుకునే మహిళలు, చిన్నపిల్లలు ఏంచేశారు... వారి మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు, ఇదేం సంస్కృతి... అని మహిళా లోకం ఆవేదన చెందుతోంది. న్యూ ఇయర్ సంబరాల్లో బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, అలాగే కమ్మనహళ్లిలో యువతిపై నడివీధిలోనే కీచక పర్వాలతో యావత్ మహిళా ప్రపంచం దిగ్భ్రమకు లోనైంది. కళ్లముందే జరుగుతున్న ఘోరాలు, సాక్ష్యాధారాలతో సహా నీచ అకృత్యాలు బయటపడుతుంటే నిశ్చేష్టులవుతున్నారు.
కొందరు మృగాళ్ల వల్ల స్త్రీలందరూ రోడ్డుమీదకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతోంది. తోడేళ్లలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలని, అప్పుడే మిగతావారికి గుణపాఠమవుతుందని మహిళలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. నేటి సమాజంలో బయటకు వెళ్లిన మహిళలు సురక్షితంగా ఇంటికి తిరిగిరావడం కలగా మారిందని వాపోయారు. పురుషుల మైండ్‌సెట్ మారాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైందని వారు ఆరోపించారు. తాజా లైంగిక వేధింపుల ఘటనలపై మహిళలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం...
చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు...
యువతులపై అత్యాచారాలకు పాశ్చాత్య సంస్కృతికి చెందిన దుస్తులు ధరించడమే కారణమైతే అటువంటి దుస్తులను తయారు చేస్తున్న సంస్థలను నిషేధించాలి. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలపై జరిగిన ఘటనలను తెరమరుగు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త సంవత్సర వేడుకులకు అన్ని భద్రత చర్యలు తీసుకున్నామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం జరిగిన ఘటనల్లో బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
– సీమా బీ.ఆర్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, కృష్ణరాజపుర
తల్లిదండ్రులు భయపడుతున్నారు
మహిళలపై లైంగికదాడులు పదే పదే పునరావృతం అవుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. డిసెంబర్ 31రాత్రి బెంగళూరులో ఆ యువతిపై యువకులు ప్రవర్తించిన తీరు హేయం. కఠినమైన చట్టాలు అమలు చేయకపోవడం వల్లే కీచకులు బరి తెగిస్తున్నారు. దీంతో అమ్మాయిలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.
– కే.భావన, పీయూసీ విద్యార్థిని, బళ్లారి
హోం మంత్రి వ్యాఖ్యలు బాధాకరం
పురుషులతో సమానంగా ఎదగాలంటే చదువు ఎంతో ముఖ్యం. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం వల్ల అమ్మాయిలను పైచదువులకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. బెంగళూరు ఘటనపై హోంమంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి.
– శాంభవి, పీయూసీ సెకెండ్ ఇయర్, బళ్లారి
మృగాల మధ్య ఉన్నట్లుంది
‘కొత్త సంవత్సరం రోజున నగరంలో యువతులపై జరిగిన లైంగిక దాడుల ఘటనలు చూస్తుంటే మనుషుల మధ్య ఉన్నామా లేక మృగాల మధ్య ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. బెంగళూరులో మహిళలపై లైంగిక దాడులు,అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణకు రాత్రివేళల్లో పోలీసులు గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది’.
– రాధా, విద్యార్థిని, యలహంక
దోషులను కఠినంగా శిక్షించాలి
యువతులపై మాత్రమే కాదు మహిళలు, చివరికి పాఠశాలకు వెళుతున్న చిన్నారులపై కూడా పైశాచికంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఘటనల్లో నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలి.
– రత్నమ్మ,దళిత సంఘర్ష సమితి ప్రధాన కన్వీనర్, కృష్ణరాజపుర
జాగ్రత్తగా ఉండాలి
మహిళలకు రక్షణ కరువైంది. ముఖ్యంగా కళాశాల అమ్మాయిలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బెంగళూరులాంటి మహా నగరాల్లో ఇలాంటి దారుణాలు జరగడం అధికారులకు, రాజకీయ నాయకులకు అప్రతిష్ట. రాత్రి వేళల్లో గస్తీని పెంచాలి.
– బీ.ఎం. సింధూ .(న్యాయవాది, తుమకూరు)
అప్రమత్తతే ఉత్తమం
మహిళలు బయటకు వెళ్లే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.
– రమా కుమారి, ( జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షురాలు, తుమకూరు)