Bengaluru molestation
-
సెల్ఫీ పేరుతో విందులో... వికృతం
బెంగళూరు: కొత్త సంవత్సరం రోజున బెంగళూరు నగరంలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎంజీ–బ్రిగేడ్ రోడ్లు, కమ్మనహళ్లి, బాణసవాడి, కబ్బన్పార్క్లలో యువతులపై లైంగిక వేధింపుల ఘటనలు మరువక ముందే కొత్త సంవత్సరం రోజునే రెవెన్యూశాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఏసీ) భార్యపై ఇలాంటి అకృత్యమే చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన శివరాజ్ అనే యువకుడిని నిన్న అరెస్ట్ చేసిన అనంతరం డీసీపీ చంద్రగుప్త మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరం సందర్భంగా కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్పార్క్లోనున్న ఆ సంఘం క్లబ్లో వేడుకలు జరగ్గా రెవెన్యూశాఖ డిప్యూటీ డైరెక్టర్ తన భార్యతో కలసి విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో భోజనం కోసం డిప్యూటీ డైరెక్టర్ తాము కూర్చున్న టేబుల్ నుంచి కౌంటర్ వద్దకు వెళ్లారు. (నడిరోడ్డుపైనే కీచకపర్వాలు) వద్దని వారిస్తున్నా వేధింపులు ఇది గమనించిన శివరాజ్ తదితర 15 మంది యువకులు ఆయన భార్య వద్దకు వచ్చి సెల్ఫీ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె పలుసార్లు హెచ్చరించినా తాగిన మైకంలో ఉన్న యువకులు మరింత వేధించసాగారు. కాసేపటికి భర్త తిరిగిరావడంతో యువకులు జారుకున్నారు. జరిగిన విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో మొదట పరువు సమస్యగా భావించిన డిప్యూటీ డైరెక్టర్, ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయదల్చుకోలేదు. (బెంగళూరులో ఏం జరగలేదా?) అయితే కమ్మనహళ్లి కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో పోలీసులపై నమ్మకం కుదిరిన బాధితులు జనవరి 4వ తేదీన కబ్బన్‌పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించి యువకుల్లో ఒకడైన శివరాజ్‌ను అరెస్ట్ చేసి మిగిలిన 14 మందియువకుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
మీ పిల్లలకు ఆ విషయం నేర్పించండి: హీరో
ముంబై: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో వేలాదిమంది సమక్షంలో మహిళలపై సాగిన కీచకపర్వంపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్పందించాడు. తల్లిదండ్రులు తమ కొడుకులకు మహిళలను గౌరవించడం గురించి నేర్పించాలని షారుక్ విజ్ఞప్తి చేశాడు. 'సెలెబ్రిటీలు అయినా, సాధారణ ప్రజలయినా మనమందరం తల్లిదండ్రులం. మహిళలను గౌరవించాలని మగపిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలి. వారు సరైన మార్గంలో నడిచేలా పెంచాలి. నా హృదయంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. నా కుమార్తె, అమ్మ, అమ్మాయిలందరూ నా హృదయానికి దగ్గరగా ఉన్నారు. ఈ విశ్వంలో వీరందరూ చాలా గౌరమైన వారని మనం గ్రహించాలి. గృహిణులైనా ఉద్యోగులైనా మహిళలందరినీ మనమందరం గౌరవించాలి' అని షారుక్ అన్నాడు. బెంగళూరు కీచక ఘటనపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా పలువురు దర్శకులు, నటీనటులు ఈ ఘటనను ఖండించారు. -
నా రక్తం ఉడికి పోతోంది: టాప్ హీరో
-
‘రోడ్డుమీదకు వెళ్లాలంటేనే భయమేస్తోంది’
సాక్షి, బెంగళూరు: పాశ్చాత్య దుస్తులు వేసుకుంటే దాడులు చేస్తారా?, ఆ హక్కు ఎవరు ఇచ్చారు?, చీరకట్టుకునే మహిళలు, చిన్నపిల్లలు ఏంచేశారు... వారి మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారు, ఇదేం సంస్కృతి... అని మహిళా లోకం ఆవేదన చెందుతోంది. న్యూ ఇయర్ సంబరాల్లో బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, అలాగే కమ్మనహళ్లిలో యువతిపై నడివీధిలోనే కీచక పర్వాలతో యావత్ మహిళా ప్రపంచం దిగ్భ్రమకు లోనైంది. కళ్లముందే జరుగుతున్న ఘోరాలు, సాక్ష్యాధారాలతో సహా నీచ అకృత్యాలు బయటపడుతుంటే నిశ్చేష్టులవుతున్నారు. కొందరు మృగాళ్ల వల్ల స్త్రీలందరూ రోడ్డుమీదకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతోంది. తోడేళ్లలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలని, అప్పుడే మిగతావారికి గుణపాఠమవుతుందని మహిళలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. నేటి సమాజంలో బయటకు వెళ్లిన మహిళలు సురక్షితంగా ఇంటికి తిరిగిరావడం కలగా మారిందని వాపోయారు. పురుషుల మైండ్‌సెట్ మారాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైందని వారు ఆరోపించారు. తాజా లైంగిక వేధింపుల ఘటనలపై మహిళలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం... చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు... యువతులపై అత్యాచారాలకు పాశ్చాత్య సంస్కృతికి చెందిన దుస్తులు ధరించడమే కారణమైతే అటువంటి దుస్తులను తయారు చేస్తున్న సంస్థలను నిషేధించాలి. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మహిళలపై జరిగిన ఘటనలను తెరమరుగు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త సంవత్సర వేడుకులకు అన్ని భద్రత చర్యలు తీసుకున్నామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం జరిగిన ఘటనల్లో బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – సీమా బీ.ఆర్. సాఫ్ట్వేర్ ఉద్యోగి, కృష్ణరాజపుర తల్లిదండ్రులు భయపడుతున్నారు మహిళలపై లైంగికదాడులు పదే పదే పునరావృతం అవుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. డిసెంబర్ 31రాత్రి బెంగళూరులో ఆ యువతిపై యువకులు ప్రవర్తించిన తీరు హేయం. కఠినమైన చట్టాలు అమలు చేయకపోవడం వల్లే కీచకులు బరి తెగిస్తున్నారు. దీంతో అమ్మాయిలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. – కే.భావన, పీయూసీ విద్యార్థిని, బళ్లారి హోం మంత్రి వ్యాఖ్యలు బాధాకరం పురుషులతో సమానంగా ఎదగాలంటే చదువు ఎంతో ముఖ్యం. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం వల్ల అమ్మాయిలను పైచదువులకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. బెంగళూరు ఘటనపై హోంమంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. – శాంభవి, పీయూసీ సెకెండ్ ఇయర్, బళ్లారి మృగాల మధ్య ఉన్నట్లుంది ‘కొత్త సంవత్సరం రోజున నగరంలో యువతులపై జరిగిన లైంగిక దాడుల ఘటనలు చూస్తుంటే మనుషుల మధ్య ఉన్నామా లేక మృగాల మధ్య ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. బెంగళూరులో మహిళలపై లైంగిక దాడులు,అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణకు రాత్రివేళల్లో పోలీసులు గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది’. – రాధా, విద్యార్థిని, యలహంక దోషులను కఠినంగా శిక్షించాలి యువతులపై మాత్రమే కాదు మహిళలు, చివరికి పాఠశాలకు వెళుతున్న చిన్నారులపై కూడా పైశాచికంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఘటనల్లో నిందితులను అత్యంత కఠినంగా శిక్షించాలి. – రత్నమ్మ,దళిత సంఘర్ష సమితి ప్రధాన కన్వీనర్, కృష్ణరాజపుర జాగ్రత్తగా ఉండాలి మహిళలకు రక్షణ కరువైంది. ముఖ్యంగా కళాశాల అమ్మాయిలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బెంగళూరులాంటి మహా నగరాల్లో ఇలాంటి దారుణాలు జరగడం అధికారులకు, రాజకీయ నాయకులకు అప్రతిష్ట. రాత్రి వేళల్లో గస్తీని పెంచాలి. – బీ.ఎం. సింధూ .(న్యాయవాది, తుమకూరు) అప్రమత్తతే ఉత్తమం మహిళలు బయటకు వెళ్లే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. – రమా కుమారి, ( జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షురాలు, తుమకూరు) -
నా రక్తం ఉడికి పోతోంది: టాప్ హీరో
ముంబై: డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో జరిగిన కీచర పర్వంపై బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తీవ్రంగా స్పందించాడు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని పేర్కొన్నాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్విటర్ లో వీడియో పోస్టు చేశాడు. మనుషుల కంటే జంతువులే నయమనిపించేలా బెంగళూరు ఘటనలు ఉన్నాయని పేర్కొన్నాడు. మానవజాతి తిరోగమనంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోందని వాపోయాడు. ‘మనిషిగా ఈరోజు ఎంతో సిగ్గుపడుతున్నా. నాలుగేళ్ల నా కూతురితో నూతన సంవత్సర వేడుకలు జరుపుని తిరిగొచ్చిన నేను బెంగళూరులో జరిగిన కీచక పర్వం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనిపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. నా రక్తం ఉడుకిపోతోంది. మహిళను గౌరవించని సంఘం మానవ సమాజం అనిపించుకోలేదు. ఆధునిక వస్త్రధారణ కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్న వారు తమ వ్యాఖ్యలను సమర్థించుకునే దమ్ముందా? మగాళ్లకు భయపడాల్సిన అవసరం మహిళలకు లేదు. ధైర్యంగా ఉండండి, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాల’ని అక్షయ్ కుమార్ అన్నాడు. అక్కీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ట్విటర్ లో 18 వేలకు పైగా లైకులు వచ్చాయి. 9 మందిపైగా రీట్వీట్ చేశారు. -
బెంగళూరు ఘటనపై ఆ ఇద్దరికీ సమన్లు!
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరులో మహిళలు బహిరంగంగా లైంగిక వేధింపులకు గురైన ఘటనపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరకు, ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) షాక్ ఇచ్చింది. ఆ ఇద్దరు నేతలకు సమన్లు జారీచేసింది. 'పార్టీలకతీతంగా కొందరు వ్యక్తులు జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థానంలో ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. దేశం ఎటువైపు వెళ్తున్నట్టు?' అని ఎన్సీడబ్ల్యూ చీఫ్ లలితా కుమారమంగళం అన్నారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు బహిరంగంగా రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ యువత పాశ్చాత్య ధోరణిని అవలంబిస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, యువతులు కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారని, ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీడబ్ల్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దేశ మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 'ఒక హోంమంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్ణకరం, ఆమోదనీయం కాదు. వేడుకల సందర్భంగా మహిళలు పాశ్చాత్య దుస్తులు వేసుకున్నంత మాత్రాన భారతీయ పురుషులు అదుపుతప్పి రెచ్చిపోతారా? అని నేను మంత్రిని అడుగదలుచుకున్నా. మహిళలను గౌరవించడం భారతీయ పురుషులు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి.. రాజీనామా చేయాలి' అని లలిత కుమారమంగళం స్పష్టం చేశారు. -
బెంగళూరు ఘటనపై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులో పోలీసుల సమక్షంలోనే పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ రిజ్వీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నగ్నత్వం మహిళలకు ఫ్యాషన్ మారిందని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. మహిళలు, పురుషులు వేర్వేరని, కాబట్టి మహిళలు రాత్రిపూట బయటకు రావొద్దని ఆయన హితబోధ చేశారు. మన సంస్కృతికి వ్యతిరేకంగా నడుచుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాత్రిపూట ఒక యువతి భర్తతో, లేదా తండ్రితోనే బయటకు వెళ్లి వేడుకలు చేసుకోవాలి కానీ, గుర్తుతెలియని వారితో కాదని అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ ఉండటం సహజమేనని, కానీ ఈ విషయంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో మహిళల భద్రతపై ప్రశ్నించగా.. భారతీయ సంస్కృతి మారిపోతున్నదని, పాశ్చాత్యీకరణ మన సంస్కృతికి మచ్చగా మారిందని చెప్పుకొచ్చారు. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన సూచించారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.