
బెంగళూరు ఘటనపై ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులో పోలీసుల సమక్షంలోనే పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై షాకింగ్ కామెంట్స్..
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులో పోలీసుల సమక్షంలోనే పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ రిజ్వీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నగ్నత్వం మహిళలకు ఫ్యాషన్ మారిందని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. మహిళలు, పురుషులు వేర్వేరని, కాబట్టి మహిళలు రాత్రిపూట బయటకు రావొద్దని ఆయన హితబోధ చేశారు.
మన సంస్కృతికి వ్యతిరేకంగా నడుచుకునే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాత్రిపూట ఒక యువతి భర్తతో, లేదా తండ్రితోనే బయటకు వెళ్లి వేడుకలు చేసుకోవాలి కానీ, గుర్తుతెలియని వారితో కాదని అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ ఉండటం సహజమేనని, కానీ ఈ విషయంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో మహిళల భద్రతపై ప్రశ్నించగా.. భారతీయ సంస్కృతి మారిపోతున్నదని, పాశ్చాత్యీకరణ మన సంస్కృతికి మచ్చగా మారిందని చెప్పుకొచ్చారు. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన సూచించారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.