
ములాయం ఆవేశం.. పార్టీకి ప్రమాదం!
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభంపై పార్టీ సీనియర్ నేత అబు అజ్మీ స్పందించారు. పార్టీ పగ్గాలు సీఎం అఖిలేశ్ యాదవ్‌కు అప్పగించడమే ఉత్తమమని, కుమారుడు అఖిలేశ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందని నేతాజీ ములాయం సింగ్ యాదవ్‌కు సూచించారు. ములాయం కోపం విడిచిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, అఖిలేశ్‌కు మద్ధతు ఇవ్వాలని లేకపోతే పార్టీకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్' తమ వర్గానికే చెందాలని ములాయం ఈసీకి విన్నవించగా.. నేడు సీఎం అఖిలేశ్ వర్గం గుర్తు తమకే ఇవ్వాలని సీఈసీని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించనున్నారు. అఖిలేశ్ మద్ధతుదారుల వివరాలను బాబాయ్ రాంగోపాల్ యాదవ్ ఈసీకి అందజేయనున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తే పగ్గాలు ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని అఖిలేశ్ గతంలో పేర్కొన్నారు. పార్టీ నెగ్గితే మాత్రం తండ్రి ములాయం తనను సీఎం పదవి నుంచి తప్పిస్తారని అఖిలేశ్ గతంలోనే చెప్పారని ఎస్పీ నేత అబు అజ్మీ వివరించారు. సమష్టిగా పోటీచేసి భారీ మెజార్టీతో నెగ్గినా.. అఖిలేశ్‌ను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు కూడా అఖిలేశ్ వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకే ఆయనకు ములాయం సహకరిస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. యూపీ నేతలతో పాటు పార్టీ మహారాష్ట్ర నేతల మద్ధుతును అఖిలేశ్ కూడగట్టుకుని అభివృద్ధి వైపు నడిపిస్తారని తాజా సంక్షోభంపై యూపీ సీఎంకు అబు అజ్మీ తన మద్ధతు తెలిపారు.