
సెల్ఫీ పేరుతో విందులో... వికృతం
కొత్త సంవత్సరం రోజున బెంగళూరు నగరంలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
బెంగళూరు: కొత్త సంవత్సరం రోజున బెంగళూరు నగరంలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎంజీ–బ్రిగేడ్ రోడ్లు, కమ్మనహళ్లి, బాణసవాడి, కబ్బన్‌పార్క్‌లలో యువతులపై లైంగిక వేధింపుల ఘటనలు మరువక ముందే కొత్త సంవత్సరం రోజునే రెవెన్యూశాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఏసీ) భార్యపై ఇలాంటి అకృత్యమే చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన శివరాజ్ అనే యువకుడిని నిన్న అరెస్ట్ చేసిన అనంతరం డీసీపీ చంద్రగుప్త మీడియాతో మాట్లాడారు.
కొత్త సంవత్సరం సందర్భంగా కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్‌పార్క్‌లోనున్న ఆ సంఘం క్లబ్‌లో వేడుకలు జరగ్గా రెవెన్యూశాఖ డిప్యూటీ డైరెక్టర్ తన భార్యతో కలసి విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో భోజనం కోసం డిప్యూటీ డైరెక్టర్ తాము కూర్చున్న టేబుల్ నుంచి కౌంటర్ వద్దకు వెళ్లారు.
(నడిరోడ్డుపైనే కీచకపర్వాలు)
వద్దని వారిస్తున్నా వేధింపులు
ఇది గమనించిన శివరాజ్ తదితర 15 మంది యువకులు ఆయన భార్య వద్దకు వచ్చి సెల్ఫీ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె పలుసార్లు హెచ్చరించినా తాగిన మైకంలో ఉన్న యువకులు మరింత వేధించసాగారు. కాసేపటికి భర్త తిరిగిరావడంతో యువకులు జారుకున్నారు. జరిగిన విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో మొదట పరువు సమస్యగా భావించిన డిప్యూటీ డైరెక్టర్, ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయదల్చుకోలేదు.
అయితే కమ్మనహళ్లి కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో పోలీసులపై నమ్మకం కుదిరిన బాధితులు జనవరి 4వ తేదీన కబ్బన్‌పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించి యువకుల్లో ఒకడైన శివరాజ్‌ను అరెస్ట్ చేసి మిగిలిన 14 మందియువకుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.