
న్యాయం గెలిచింది
సాక్షి, చెన్నై : ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో సాగినా, చివరకు న్యాయం గెలిచిందని, చట్టానికి ఎవరూ అతీతులు కారన్నది మరో మారు రుజువైందని డీఎంకే అధినేత ఎం కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌లు వ్యాఖ్యానించారు.సీఎం జయలలిత అండ్ బృందానికి జైలు శిక్ష పడిందో లేదో ఓ వైపు అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే, మరో వైపు డీఎంకే, డీఎండీకే, బీజేపీలు హర్షం వ్యక్తం చేశాయి. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ, కేసును నీరుగార్చేందుకు పలు రకాల ప్రయత్నాలు సాగినా, చివరకు న్యాయం గెలిచిందన్నారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ పిటిషన్‌తోనే కేసు కర్ణాటక కోర్టుకు వెళ్లిందని, అందుకే తప్పు చేసిన వారికి శిక్ష పడిందని పేర్కొన్నారు. ఈ కే సులో న్యాయం గెలిచిన దృష్ట్యా, డీఎంకే వర్గాలు ఎవ్వరూ స్వీట్లు పంచడం, బాణసంచాలు పేల్చడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు.
ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే
డీఎండీకే అధినేత విజయకాంత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉప్పు తింటే..నీళ్లు తాగాల్సిందే, తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అన్న నానుడిని గుర్తు చేస్తూ, ఇప్పుడు జరిగింది అదేనని పేర్కొన్నారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్నారు. సీఎం హోదాలో ఉన్న జయలలితకు ఈ శిక్ష పడటం వలన తమిళనాడు పరువు ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత రూపంలో తమిళులు తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో కేసులు లాక్కొచ్చినా చివరకు శిక్ష పడడం ఆనందంగా ఉందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఓ మీడియాతో మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేసిందన్నారు. న్యాయ స్థానాలకు బీజేపీ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం కల్పించిందన్న విషయం ఈ కేసు ద్వారా నిరూపితమయ్యిందన్నారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రీతిలో ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. సీపీఐ నేత రాజా ఓ మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పు అవినీతి పరులకు ఓ హెచ్చరిక వంటిదన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఏ పదవిలో ఉన్నా సరే , తప్పు చేస్తే శిక్షించాల్సిందేనన్నారు. అయితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే, అది తమిళనాడు అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి పేర్కొంటూ న్యాయస్థానాలు ఎవరికీ చుట్టాలు కావని ఈ తీర్పు స్పష్టం చేసిందన్నారు.