tamilnadu cm jayalalitha
-
జయ త్వరలోనే కోలుకుంటుంది
-
'అమ్మ ఆరోగ్యంపై ఆందోళన వద్దు'
-
'అమ్మ ఆరోగ్యంపై ఆందోళన వద్దు'
సాక్షి, చెన్నై: తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రమంగా కోలుకుంటున్నట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, ఇక ఎలాంటి ఆందోళన వద్దని, త్వరలోనే ఆమె ఇంటికి చేరుకుంటారని ఏఐడీఎంకే నాయకురాలు, సినీ నటి సీఆర్ సరత్వతి మీడియాకు చెప్పారు. తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతోన్న జయలలితను గురువారం(సెప్టెంబర్ 22న) చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. (సింగపూర్‌కు జయలలిత తరలింపు?) ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, రెవెన్యూ మంత్రి ఆర్బీ.ఉదయకుమార్, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, సలహాదారు షీలాబాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తదితరులున్నారు ఆదివారం ఆసుపత్రికి వచ్చి ముఖ్యమంత్రిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా తమ అమ్మ కోసం అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో నిమగ్నమయ్యాయి. (ఆస్పత్రిలో అమ్మ) -
జయలలితతో ప్రధాని మోడి భేటి!
-
‘జయ’ సేన ఆగ్రహజ్వాల
సాక్షి, చెన్నై : ఆదాయూనికి మించిన ఆస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ బృందానికి ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న నరాలు తెగే ఉత్కంఠ ఉదయం నుంచి రాష్ట్రంలో నెలకొంది. బెంగళూరు కోర్టు విచారణ నిమిత్తం సరిగ్గా ఎనిమిదిన్నర గంటలకు నెచ్చెలి శశికళ, బంధువు ఇలవరసితో కలసి ఒకే వాహనంలో జయలలిత మీనంబాక్కం విమానాశ్రయూనికి బయలు దేరారు. ఆమె కాన్వాయ్ మార్గంలో మునుపెన్నడూ లేని రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. బెంగళూరు కోర్టుల్లో సరిగ్గా 11 గంటలకు విచారణ ఆరంభం కాగా, అప్పటి నుంచే ప్రజలు టీవీలకు అతుక్కు పోయారు. రాష్ట్రంలో జయలలిత కేసు తీర్పు వివరాలు తెలుసుకోవాలన్న ఆత్రుతతో ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. అమ్మ నిర్దోషిగా బయటకు వస్తుందన్న ధీమాతో ఉన్నా, ఒంటి గంట సమయంలో జయలలిత అవినీతి కేసులో దోషి అంటూ తమిళ చానళ్లు మినహా తక్కిన ఇతర న్యూస్ చానళ్లు వ్యూహాత్మకంతో ఫ్లాష్ న్యూస్‌లను ప్రకటించేశాయి. అయితే, తమిళ చానళ్లలో ఆ సమాచారం లేని దృష్ట్యా, అమ్మ నిర్దోషిగా బయటకు వస్తుందనన్న భావనలోనే అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. నిర్మానుష్యం : జయలలిత దోషి అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఒక్క సారిగా రాష్ర్టంలో వాతావరణం మారుతూ వచ్చింది. దుకాణాల్ని స్వచ్ఛందంగా కొన్ని చోట్ల మూసి వేశారు. రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. కొన్ని కూడళ్లల్లో పోలీసులు రంగంలోకి దిగారు. సరిగ్గా మూడు గంటలకు తీర్పు వెలువడుతుందంటూ టీవీల్లో వార్తలు రావడంతో, ఆ తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ప్రధాన నగరాల్లో ఎక్కడికక్కడ బస్సుల్ని నిలుపుదల చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్ని బస్సులు ఇతర రూట్లలో నడుస్తుండడంతో, ఆ డ్రైవర్లను అప్రమత్తం చేశారు. అనేక ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లోని భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా డీఎంకే కార్యాలయాల వద్ద భద్రతను పెంచుతూ చర్యలు తీసుకున్నారు. ఆగ్రహ జ్వాల: సరిగ్గా రెండున్నర గంటల సమయంలో జయలలిత దోషి అంటూ తమిళ చానళ్లు సైతం ప్రసారం చేయడంతో వాతావరణం వేడెక్కింది. ఎక్కడికక్కడ అన్నాడీఎంకే వర్గాలు రెచ్చి పోయారుు. తమ అధినేత్రికి జైలు శిక్ష తప్పదన్న విషయాన్ని గ్రహించి ఆగ్రహానికి లోనైన అభిమానులు తెరచి ఉన్న దుకాణాలపై దాడులకు దిగారు. రోడ్ల మీద వెళుతున్న కార్లు, పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లపై తమ ప్రతాపం చూపించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలి, మదురై, తూత్తుకుడి, తంజావూరు తదితర నగరాల్లో మరింతగా వీరంగం సృష్టించారు. డీఎంకే వర్గాల ఇళ్లపై, కార్యాలయాలపై రాళ్లు రువ్వే పనిలో పడ్డారు. పోలీసులు వారించే యత్నం చేసినా ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని చోట్ల డీఎంకే ఫ్లెక్సీలను తగుల బెట్టారు. ప్రైవేటు సంస్థలపై రాళ్లతో దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు చోద్యం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నాడీఎంకే నాయకులందరూ బెంగళూరుకు తరలి వెళ్లడంతో కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని కట్టడిచేసే వారు కరువయ్యారు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీద బైఠాయించడంతో పాటుగా, అటు వైపుగా వచ్చిన బస్సులు వాహనాలపై తమ ప్రతాపం చూపించడంతో పలు చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించారు. జయలలిత నియోజకవర్గం శ్రీరంగంలో దుకాణాలకు నిప్పు పెట్టారు. కాంచీపురంలో ఓ బస్సుకు నిప్పు పెట్టగా, మరి కొన్ని చోట్ల సుమారు వందకు పైగా బస్సులపై ప్రతాపం చూపించారు. జయలలితపై పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామిపై ఇంటిపై దాడికి యత్నించారు. ఆయన చిత్ర పటాల్ని, దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సాయంత్రానికి నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. జనం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది. రంగంలోకి గవర్నర్: రాష్ర్టంలో పరిస్థితి అదుపు తప్పుతుండడంతో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య రంగంలోకి దిగారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళన కారుల్ని అణచివేస్తూ, అరెస్టులకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొ న్ని చోట్ల ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు తీవ్రంగానే లాఠీలు ఝుళిపించారు. రాష్ట్రంలో ని అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాం గం ఆగమేఘాలపై రాజ్ భవన్‌కు పరుగులు తీశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ రోశయ్య పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీ కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహనవర్గీస్, డీజీపీ రామనుజం తదితర అధికారులతో భద్రతపై సమీక్షించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వలయంలోకి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. వాతావరణం వేడెక్కడంతో ఎక్కడికక్కడ ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు ఆగిపోయూయి. ముందుస్తుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. చెన్నై నగరంలో పూర్తి స్థాయిలో పలు మార్గాల్లో నగర బస్సుల రాకపోకలు ఆగిపోయూయి. ఎలక్ట్రిక్ రైళ్లు భద్రత నడుమ కదిలాయి. కరుణ ఇంటిపై దాడికి యత్నం తమ అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడటంతో అన్నాడీఎంకే వర్గాలు కరుణానిధి ఇంటిపై దాడికి యత్నించాయి. గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వైపుగా అన్నాడీఎంకే కార్యకర్తలు దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. తామెమీ తక్కువ తిన్నామా అన్నట్టు డీఎంకే వర్గాలు ప్రతిదాడికి పరుగులు తీయడంతో పరిస్థితి అదుపు తప్పింది. సకాలంలో పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితిని చక్కదిద్దారు. మీడియాపై దాడి అన్నాడీఎంకే వర్గాలు తమ ఆగ్రహాన్ని మీడియాపై కూడా చూపించారుు. పోయెస్ గార్డెన్ వద్ద విధుల్లో ఉన్న ఆంగ్ల ఛానల్‌పై విరుచుకుపడ్డారు. జయలలితకు సంబంధించిన కథనంతో ప్రత్యక్ష ప్రసారంలో నిమగ్నమైన ఎన్డీటీవీ మహిళా జర్నలిస్టుపై అన్నాడీఎంకే మహిళలు తమ ఆగ్రహాన్ని చూపించారు. కెమెరామెన్‌పై దాడికి దిగారు. పక్కనే ఉన్న న్యూస్ ఎక్స్ చానల్ సిబ్బందిపై కూడా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. రెండు కెమెరాలను ధ్వంసం చేశారు. ఓబీ వ్యాన్‌పై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనను మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మద్రాసు రిపోర్టర్స్ గిల్డ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే సింది. -
న్యాయం గెలిచింది
సాక్షి, చెన్నై : ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో సాగినా, చివరకు న్యాయం గెలిచిందని, చట్టానికి ఎవరూ అతీతులు కారన్నది మరో మారు రుజువైందని డీఎంకే అధినేత ఎం కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌లు వ్యాఖ్యానించారు.సీఎం జయలలిత అండ్ బృందానికి జైలు శిక్ష పడిందో లేదో ఓ వైపు అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే, మరో వైపు డీఎంకే, డీఎండీకే, బీజేపీలు హర్షం వ్యక్తం చేశాయి. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ, కేసును నీరుగార్చేందుకు పలు రకాల ప్రయత్నాలు సాగినా, చివరకు న్యాయం గెలిచిందన్నారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ పిటిషన్‌తోనే కేసు కర్ణాటక కోర్టుకు వెళ్లిందని, అందుకే తప్పు చేసిన వారికి శిక్ష పడిందని పేర్కొన్నారు. ఈ కే సులో న్యాయం గెలిచిన దృష్ట్యా, డీఎంకే వర్గాలు ఎవ్వరూ స్వీట్లు పంచడం, బాణసంచాలు పేల్చడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు. ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే డీఎండీకే అధినేత విజయకాంత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉప్పు తింటే..నీళ్లు తాగాల్సిందే, తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అన్న నానుడిని గుర్తు చేస్తూ, ఇప్పుడు జరిగింది అదేనని పేర్కొన్నారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్నారు. సీఎం హోదాలో ఉన్న జయలలితకు ఈ శిక్ష పడటం వలన తమిళనాడు పరువు ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత రూపంలో తమిళులు తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో కేసులు లాక్కొచ్చినా చివరకు శిక్ష పడడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఓ మీడియాతో మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేసిందన్నారు. న్యాయ స్థానాలకు బీజేపీ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం కల్పించిందన్న విషయం ఈ కేసు ద్వారా నిరూపితమయ్యిందన్నారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రీతిలో ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. సీపీఐ నేత రాజా ఓ మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పు అవినీతి పరులకు ఓ హెచ్చరిక వంటిదన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఏ పదవిలో ఉన్నా సరే , తప్పు చేస్తే శిక్షించాల్సిందేనన్నారు. అయితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే, అది తమిళనాడు అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి పేర్కొంటూ న్యాయస్థానాలు ఎవరికీ చుట్టాలు కావని ఈ తీర్పు స్పష్టం చేసిందన్నారు. -
ఎన్నికల తర్వాత...ముందు
చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యంగా అనాదిగా కొనసాగుతున్న రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరో పార్టీ హయాంలో జరిగిన అక్రమాలను ఆరాతీయడం, జైళ్లలోకి నెట్టడం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది. 1991, 2001, 2011లో జరిగిన ఎన్నికల్లో మొత్తం మూడుసార్లు జయ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. జయ ముఖ్యమంత్రిగా డీఎంకే శ్రేణులపై కొరడా ఝుళిపించగా, ఆమె తరువాత అధికారంలోకి వచ్చి కరుణానిధి జయ పాలనపై ధ్వజమెత్తి కేసులు పెట్టారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమిళనాడు స్మాల్స్కేల్స్ ఇండస్ట్రీస్ (టాన్సీ) భూముల కొనుగోలు, సొంతానికి రాయితీలు, సబ్సిడీలను వాడుకున్న ఆరోపణలను డీఎంకే ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం జయపై మోపిన టాన్సీ అభియోగాలపై ఐదేళ్ల శిక్షను కోర్టు ఖరారు చేసింది. శిక్ష అమలుపై సుప్రీం కోర్టు నుంచి జయ స్టే తెచ్చుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రచారానికి వెళ్లడం అవమానంగా భావించి బరిలో నిలబడలేదు. ఆమెపై వచ్చిన ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోని ఓటర్లు అన్నాడీఎంకేకు పట్టం కట్టారు. శాసనసభా పక్షనేతగా జయలలిత ఎన్నికకాగనే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి గవర్నర్ ఆహ్వానించారు. ఎమ్మెల్యే కాకున్నా ఆమె శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడం కలకలం సష్టించింది. అవినీతి కేసులో శిక్షపడి సుప్రీం కోర్టు జారీచేసిన స్టేతో కాలంగడుపుతున్న జయలలితను గవర్నర్ ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో సుప్రీం కోర్టు అడ్డుకట్టవేసింది. సీఎం కుర్చీలో కూర్చోకుండానే జయ తప్పుకుని తనకు బదులుగా విశ్వాసపాత్రుడైన ఓ పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. కొంతకాలం ఇంటికే పరిమితమై తెర వెనక నుంచి ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ తరువాత టాన్సీ కేసులో సుప్రీం కోర్టు నుంచి క్లీన్‌చిట్‌ను పొందారు. ఆ తరువాత జైలు నుంచి విడుదలైన జయ ఆండిపట్టి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచిన తొలి ఆరునెలల్లోనే అన్ని అడ్డంకులను అధిగమించి సీఎంగా మారారు. మెడకు చుట్టుకున్న మరో కేసు టాన్సీ కేసు నుంచి బయటపడినా ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టిన కేసు ఆమె మెడకు చుట్టుకుంది. 1991-96 కాలంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమంగా ఆస్తులను ఆర్జించారని ఆరోపిస్తూ అప్పటి జనతాపార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి డీఎంకే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 1996 జూన్ 14న స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ఏసీబీ ఆదాయానికి మించి రూ.66.44 కోట్లను అమ్మ అక్రమంగా ఆర్జించినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో జయతోపాటూ ఆమె దత్తపుత్రుడు సుధాకర్, నెచ్చెలి శశికళ, బంధువు ఇళవరసిలను చేర్చారు. 1997 నుంచి 2004 వరకు చెన్నై కోర్టులో కేసు నడిచింది. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే ఈ కేసును జయ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వేరే రాష్ట్రానికి మార్చాలన్న డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ అభ్యర్థన మేరకు జయ ఆస్తుల కేసు 2005లో బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. 18 ఏళ్లపాటు సాగిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు శనివారం ఇచ్చిన తీర్పులో జయకు నాలుగేళ్ల జైలు శిక్షపడింది. గతంలో శిక్షపడినపుడు ఎన్నికలు ముగిసిపోగా, ప్రస్తుతం ఏడాదిన్నర కాలంలో అన్నాడీఎంకే ఎన్నికలను ఎదుర్కొవాల్సి ఉంది. గతంలో కేసులను ఎదుర్కొంటున్న తరుణంలో అన్నాడీఎంకే ఎన్నికలు జరిగాయి. అయితే నేడు శిక్ష ఖరారై 2016లో ఎన్నికలు రాబోతున్నాయి. తాజా పరిణామం అన్నాడీఎంకేను అప్రతిష్టపాలు చేసి ఎన్నికల్లో ఘోరపరాజయానికి దారితీస్తుందా లేక సానుభూతి పవనాలు వీసి మళ్లీ పట్టకడుతుందా అనేది వేచి చూడాల్సిందే! -
తీర్పుతో మారిన సీన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పుపై ఉత్కంఠకు శనివారం సాయంత్రం తెరపడింది. జయకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో కాబోయే సీఎం ఎవరో అనే చర్చకు తెరలేచింది. పన్నీరు సెల్వం, షీలా బాలకృష్ణన్‌కు అవకాశాలున్నా యన్న చర్చ మొదలైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలుకావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. సీఎం కుర్చీ ఖాళీ కావడంతో ప్రభుత్వంలో సైతం సీను మారిపోగా, కాబోయే సీఎం ఎవరనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో మూడు పేర్లు షికా రు చేస్తున్నాయి. జయకు జైలు శిక్ష పడిన పక్షంలో మళ్లీ ఆమె బయటకు రాగానే సీఎం కుర్చీని అప్పగించే వ్యక్తికే ఇప్పుడు ఆ పదవి వరిస్తుంది. బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పేందుకు వారంరోజుల ముందు నుంచే శిక్షపై అమ్మకు అనుమానం వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందు కే ముగ్గురు విశ్వాస పాత్రులను జయ ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు మంత్రులు కాగా, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారిణి అని అంటున్నారు. ఎంజీఆర్ హయాం నుంచి జయకు అత్యంత విశ్వసనీయపాత్రుడైన ఆర్థిక మంత్రి ఓ పన్నీర్‌సెల్వం, రవాణాశాఖా మంత్రి సెంధిల్ బాలాజీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ పేరును సైతం అమ్మ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన షీలాకు మంచి పరిపాలనా అనుభవం ఉంది. అంతకంటే ముఖ్యంగా జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే రిటైర్మెంటు అయిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా షీలాను జయ తన వద్దనే ఉంచుకున్నారు. ప్రస్తుతం సీఎం పదవి దక్కించుకోవడానికి ఈ ముగ్గురిలో షీలాకే ఎక్కువ అవకాశాలు ఉన్నారుు. అమ్మకు దత్తపుత్రుడిగా పేరొందిన సెంథిల్ బాలాజీ నమ్మకస్తుడైనా వయస్సులో మరీ పిన్నవాడు కావడం అమ్మను ఆలోచింపచేసి ఉండొచ్చు. సహజంగా ఎవరికీ రెండోసారి మంచి అవకాశం ఇచ్చే అలవాటులేని అమ్మ... పన్నీర్‌సెల్వంను పక్కన పెట్టవచ్చు. పార్టీ పరంగా అనుభవజ్ఞుడైన పన్నీర్‌సెల్వంకు పార్టీ, పరిపాలనా పరంగా అనుభవం, ఉన్నత విద్యార్హత కలిగిన షీలా బాలకృష్ణన్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా తీర్పును కలుపుకుంటే జయ రెండుసార్లు జైలుకెళ్లినా సీఎం హోదాలో కటకటాలపాలు కావడం ఇదే మొదటిసారి. ఈ అప్రతిష్ట రాబోయే ఎన్నికల్లో పార్టీ జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జయకు పడిన శిక్షను రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రధానాస్త్రంగా మార్చుకుంటాయి. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలను దీటుగా ఎదుర్కొని పార్టీని అధికారంలో తేవాల్సిన బాధ్యతను కొత్త వ్యక్తి మోయూల్సి ఉంటుంది. ఇటుంటి గడ్డు పరిస్థితుల్లో కాలం చెల్లిపోతున్న ప్రభుత్వం కంటే మళ్లీ అధికార పీఠాన్ని ఎక్కించగలిగే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా పార్టీ నడిపే బాధ్యతలను పన్నీర్‌సెల్వంపై పెట్టి, ప్రభుత్వ పగ్గాలను షీలా బాలకృష్ణన్‌కు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
జయలలిత భావి ప్రధాని అంటూ కరపత్రాలు
హొసూరు, న్యూస్‌లైన్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భావి ప్రధాని అనే అర్థం వచ్చేలా ముద్రించిన కరపత్రాలను అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. మూడవ పర్యాయం ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జయలలిత పాలన రెండేళ్ళు ముగియడంతో రాష్ట్ర అభివృద్ధిపై అన్నాడీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కరపత్రాలు పంచుతూ వీధిప్రచారం చేస్తోంది. అయితే కరపత్రాల్లో పార్లమెంట్ భవనం ముందు జయలలిత ఉన్న ఫొటోను ముద్రించి పంపిణీ చేస్తూ భావి ప్రధానిగా ప్రచారం చేస్తున్నారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ర్టంలోని 39 లోకసభ స్థానాలు, పాండిచ్చేరికి చెందిన ఒక లోకసభ స్థానాన్ని అన్నాడీఎంకే గెలుచుకొంటే కేంద్రంలో జయలలిత చక్రం తిప్పుతారనేది ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల ధీమా. ఇదిలా ఉండగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడితో స్నేహంగా మెలుగుతున్న జయలలితను భావి ప్రధాని అనే అర్థం వచ్చేలా కరపత్రాల ద్వారా అన్నా డీఎంకే నాయకులు ప్రచారం చేయడం బీజేపి నాయకులకు మింగుడు పడడంలేదని, వీరి అత్యుత్సాహం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.