తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భావి అనే అర్థం వచ్చేలా ముద్రించిన కరపత్రాలను అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు.
హొసూరు, న్యూస్‌లైన్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భావి ప్రధాని అనే అర్థం వచ్చేలా ముద్రించిన కరపత్రాలను అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. మూడవ పర్యాయం ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జయలలిత పాలన రెండేళ్ళు ముగియడంతో రాష్ట్ర అభివృద్ధిపై అన్నాడీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కరపత్రాలు పంచుతూ వీధిప్రచారం చేస్తోంది. అయితే కరపత్రాల్లో పార్లమెంట్ భవనం ముందు జయలలిత ఉన్న ఫొటోను ముద్రించి పంపిణీ చేస్తూ భావి ప్రధానిగా ప్రచారం చేస్తున్నారు.
రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ర్టంలోని 39 లోకసభ స్థానాలు, పాండిచ్చేరికి చెందిన ఒక లోకసభ స్థానాన్ని అన్నాడీఎంకే గెలుచుకొంటే కేంద్రంలో జయలలిత చక్రం తిప్పుతారనేది ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల ధీమా. ఇదిలా ఉండగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడితో స్నేహంగా మెలుగుతున్న జయలలితను భావి ప్రధాని అనే అర్థం వచ్చేలా కరపత్రాల ద్వారా అన్నా డీఎంకే నాయకులు ప్రచారం చేయడం బీజేపి నాయకులకు మింగుడు పడడంలేదని, వీరి అత్యుత్సాహం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.