చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యంగా అనాదిగా కొనసాగుతున్న రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరో పార్టీ హయాంలో జరిగిన అక్రమాలను ఆరాతీయడం, జైళ్లలోకి నెట్టడం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది. 1991, 2001, 2011లో జరిగిన ఎన్నికల్లో మొత్తం మూడుసార్లు జయ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. జయ ముఖ్యమంత్రిగా డీఎంకే శ్రేణులపై కొరడా ఝుళిపించగా, ఆమె తరువాత అధికారంలోకి వచ్చి కరుణానిధి జయ పాలనపై ధ్వజమెత్తి కేసులు పెట్టారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తమిళనాడు స్మాల్‌స్కేల్స్ ఇండస్ట్రీస్ (టాన్సీ) భూముల కొనుగోలు, సొంతానికి రాయితీలు, సబ్సిడీలను వాడుకున్న ఆరోపణలను డీఎంకే ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నారు.
డీఎంకే ప్రభుత్వం జయపై మోపిన టాన్సీ అభియోగాలపై ఐదేళ్ల శిక్షను కోర్టు ఖరారు చేసింది. శిక్ష అమలుపై సుప్రీం కోర్టు నుంచి జయ స్టే తెచ్చుకున్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రచారానికి వెళ్లడం అవమానంగా భావించి బరిలో నిలబడలేదు. ఆమెపై వచ్చిన ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోని ఓటర్లు అన్నాడీఎంకేకు పట్టం కట్టారు. శాసనసభా పక్షనేతగా జయలలిత ఎన్నికకాగనే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి గవర్నర్ ఆహ్వానించారు. ఎమ్మెల్యే కాకున్నా ఆమె శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడం కలకలం సష్టించింది. అవినీతి కేసులో శిక్షపడి సుప్రీం కోర్టు జారీచేసిన స్టేతో కాలంగడుపుతున్న జయలలితను గవర్నర్ ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో సుప్రీం కోర్టు అడ్డుకట్టవేసింది. సీఎం కుర్చీలో కూర్చోకుండానే జయ తప్పుకుని తనకు బదులుగా విశ్వాసపాత్రుడైన ఓ పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. కొంతకాలం ఇంటికే పరిమితమై తెర వెనక నుంచి ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ తరువాత టాన్సీ కేసులో సుప్రీం కోర్టు నుంచి క్లీన్‌చిట్‌ను పొందారు. ఆ తరువాత జైలు నుంచి విడుదలైన జయ ఆండిపట్టి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచిన తొలి ఆరునెలల్లోనే అన్ని అడ్డంకులను అధిగమించి సీఎంగా మారారు.
మెడకు చుట్టుకున్న మరో కేసు
టాన్సీ కేసు నుంచి బయటపడినా ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టిన కేసు ఆమె మెడకు చుట్టుకుంది. 1991-96 కాలంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమంగా ఆస్తులను ఆర్జించారని ఆరోపిస్తూ అప్పటి జనతాపార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి డీఎంకే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 1996 జూన్ 14న స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ఏసీబీ ఆదాయానికి మించి రూ.66.44 కోట్లను అమ్మ అక్రమంగా ఆర్జించినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో జయతోపాటూ ఆమె దత్తపుత్రుడు సుధాకర్, నెచ్చెలి శశికళ, బంధువు ఇళవరసిలను చేర్చారు. 1997 నుంచి 2004 వరకు చెన్నై కోర్టులో కేసు నడిచింది. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే ఈ కేసును జయ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వేరే రాష్ట్రానికి మార్చాలన్న డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ అభ్యర్థన మేరకు జయ ఆస్తుల కేసు 2005లో బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది.
18 ఏళ్లపాటు సాగిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు శనివారం ఇచ్చిన తీర్పులో జయకు నాలుగేళ్ల జైలు శిక్షపడింది. గతంలో శిక్షపడినపుడు ఎన్నికలు ముగిసిపోగా, ప్రస్తుతం ఏడాదిన్నర కాలంలో అన్నాడీఎంకే ఎన్నికలను ఎదుర్కొవాల్సి ఉంది. గతంలో కేసులను ఎదుర్కొంటున్న తరుణంలో అన్నాడీఎంకే ఎన్నికలు జరిగాయి. అయితే నేడు శిక్ష ఖరారై 2016లో ఎన్నికలు రాబోతున్నాయి. తాజా పరిణామం అన్నాడీఎంకేను అప్రతిష్టపాలు చేసి ఎన్నికల్లో ఘోరపరాజయానికి దారితీస్తుందా లేక సానుభూతి పవనాలు వీసి మళ్లీ పట్టకడుతుందా అనేది వేచి చూడాల్సిందే!
ఎన్నికల తర్వాత...ముందు
Published Sun, Sep 28 2014 12:59 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
Advertisement
Advertisement